అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలంగాణలవాసి.. వీరాభిమాని బుస్స కృష్ణ గుర్తున్నాడా? అతను ట్రంప్ కు ఎంతటి వీరాభిమానో చాలామందికి తెలుసు. ట్రంప్ భారత్ కు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ కు కలవాలని తెగ తహతహలాడిపోతున్నాడు కృష్ణ. డొనాల్డ్ ట్రంప్ నా దేవుడు..ఆయన్ని పూజించకుండా పచ్చి గంగ కూడా ముట్టను అటువంటి నాదేవుడు ఇండియాకు వస్తున్నాడు. అతడిని కలిసే అవకాశం కల్పించాలని..కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు బుస్స కృష్ణ.
అసలు విషయం ఏందంటే.. జనగామకు చెందిన బుస్స కృష్ణ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు వీరాభిమాని. ట్రంప్ అంటే కృష్ణకు చచ్చేంత ప్రేమ. ఆయన దేవుడిలా కొలుస్తాడు. ఆరాధిస్తాడు. ఎంత అభిమానం అంటే ట్రంప్ కు ఏకంగా తన ఇంటిముందు ఓ గుడే కట్టేశాడు. గుడి అంటే పెద్ద గుడి కాదు కానీ..తన స్తోమతకు తగినట్లుగా ఒక షెడ్‌ను నిర్మించి, అందులో ట్రంప్ విగ్రహం ప్రతిష్టించాడు.
ప్రతిరోజు క్రమం తప్పకుండా ట్రంప్ విగ్రహానికి పూజలు చేస్తాడు. ట్రంప్ నిండా నూరేండ్లు జీవించాలని కోరుకుంటూ ప్రతి శుక్రవారం ఉపవాసం కూడా చేస్తాడు. అందుకే ఊరి జనం అంతా బుస్స కృష్ణను.. ట్రంప్ కృష్ణ అని పిలుస్తారు.
ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫిబ్రవరి 24న భారత్‌కు రానున్న విషయం తెలుసుకున్నా కృష్ణ ఆనందంతో ఎగిరి గంతేశాడు. ఎక్కడలేని సంతోషంతో ఉబ్బి తబ్బిడ్డు అవుతున్నాడు. ట్రంప్ పర్యటన సందర్భంగా తనకు ఆయనను కలిసే అవకాశం కల్పించాలంటూ బుస్స కృష్ణ కేంద్రానికి విజ్ఞప్తి చేశాడు.
‘ట్రంప్ నాకు దేవుడు. నేను ఎక్కడి వెళ్లినా ఆయన ఫొటో వెంబడే ఉంటుంది. ఏ పని అయినా ఆయన ఫొటోకు దండం పెట్టుకుని మొదలుపెడుతాను. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడాలని రోజూ ట్రంప్ విగ్రహానికి పూజలు చేస్తున్నా. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నా. ఇప్పుడు ఆయన మన దేశానికి వస్తుండంటంతో ప్రత్యక్షంగా కలువాలని కోరుకుంటున్నా’ అని బుస్స కృష్ణ.. సారీ ట్రంప్ కృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాడు.
కేంద్రప్రభుత్వం తప్పకుండా ట్రంప్‌ను కలువాలన్న తన కలను నెరవేరుస్తుందని కృష్ణ ఎంతో నమ్మకంతో ఉన్నాడు కృష్ణ. కృష్ణ ఫ్రెండ్స్ కూడా అతన్ని ప్రోత్సహిస్తున్నారు. అతను ట్రంప్‌ను దేవుడికంటే ఎక్కువగా ఆరాధిస్తాడని.. అంతగా ఆరాధించే కృష్ణకు ఒక్కసారి ట్రంప్‌ను కలిసే అవకాశం ఇస్తే బాగుంటుందని అంటున్నారు. మరి కేంద్రప్రభుత్వం కృష్ణ కలను నెరవేరుస్తుందా లేదో వేచి చూడాల్సిందే.