చైనా నుంచి భారత్ లోకి ఎంటర్ అయిన కరోనా వైరస్..తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఈ క్రమంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పమత్తమైంది. శ్రీవారి మెట్టు..అలిపిర మార్గాల్లో కరోనా వైరస్ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. నడక దారిలో వచ్చే భక్తులను డాక్టర్లు థర్మల్ గన్ తో పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటోంది.(ఇద్దరు కేరళ నర్సులకు కరోనా పాజిటివ్!)
జలుబు,దగ్గులతో బాధపడేవారు తిరుమలకు రావద్దని సూచించిన టీటీడీ..కరోనా వైరస్ పై తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాదు తిరుమలకు వచ్చే భక్తులంతా మాస్కులు..శానిటైజర్లు తెచ్చుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే భక్తులకు కీలక సూచనలు చేసింది. విదేశీయులు గానీ, విదేశాల్లో పర్యటించిన భారతీయులు గానీ.. భారత్‌లో అడుగు పెట్టిన 28 రోజుల వరకు తిరుమల సందర్శనకు రావొద్దని విజ్ఞప్తి చేసింది.
తిరుమలలో నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు ఉంటారని..కరోనా వైరస్ సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కరోనా వైరస్ ఒకరి నుండి అనేక మందికి సులభంగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ క్రమంలో భక్తుల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని.. విదేశాల నుండి వచ్చే భక్తుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు 4,090 మంది చనిపోయారు. మరో లక్షా 16వేల మంది ఈ వైరస్ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో కరోనా మరణాలు సంభవించాయి. చైనాలో ఇప్పటి వరకు 3,136 మంది చనిపోయారు. చైనా తర్వాత ఇటలీ రెండో స్థానంలో ఉంది.
ఇటలీలో 463 మంది మరణించారు. ఇరాన్‌లో 291, దక్షిణ కొరియా 54, అమెరికాలో 27, ఫ్రాన్స్‌లో 30, స్పెయిన్లో 31, జపాన్‌లో 10, యూకే 5, నెదర్లాండ్స్ 4, ఆస్ట్రేలియా 3, హాంగ్‌కాంగ్ 3, స్విట్జర్లాండ్‌లో ఇద్దరు చనిపోయారు. ఇరాన్‌లో ఇవాళ ఒక్క రోజే 54 మంది చనిపోయారంటే. అక్కడ వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకుంటేనే భయాందోళనలు కలుగుతున్నాయి.