ప్లాస్టిక్ సర్జరీ వికటించింది : అందం కోసం వెళితే.. వికారంగా మార్చేశారు

మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు పురుషుల్లోనూ సౌందర్య పిపాస పెరిగిపోతోంది. అందానికి మెరుగులు దిద్దుకోవాలని ఆరాటపడుతున్నయువత కొత్త పుంతలు తొక్కుతున్నారు. శరీర సౌష్టవంతో పాటు ముఖారవిందం మెరిసేలా ఉండాలని తహతహలాడుతున్నారు. ఇదే విధంగా ఆశపడి అందంగా కనిపించాలనకున్నపశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో యువకుడి ప్రాణాల మీదకు వచ్చింది. ప్లాస్టిక సర్జరీ వికటించి మొహం అందం వికారంగా మారి మతిస్థిమితం కోల్పోయేలా చేసింది. 

భీమవరానికి చెందిన శివకు అందంగా ఉండాలనే వ్యామోహం. తన రూపాన్ని మరింత తీర్చిదిద్దుకోవాలన్న ఆశ. చేసేది మెకానిక్ పని కావడంతో… మోడ్రన్ బైక్‌లన్నీ చేతిలో ఉంటాయి. వాటిని డ్రైవ్ చేసుకుంటూ సినీ హీరోలతో పోల్చుకునేవాడు. ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేసేవాడు. కొంచెం కొంచెంగా కూడబెట్టిన డబ్బులతో హీరోలా తయారవాలనుకున్నాడు. కొద్ది రోజుల క్రితం అగ్ని ప్రమాదం సంభవించడంతో ముఖంపై తెల్లటి మచ్చలు ఏర్పాడ్డాయి. వాటిని తొలగించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని భావించాడు. భీమవరంలోని న్యూ లండన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆశ్రయించాడు. తనకు ప్లాస్టిక్ సర్జరీ చేసి… మొహంపై ఉన్న మచ్చల్ని పోవాలని కోరడంతో వైద్యులు రూ.4లక్షలు ఇస్తే పని అయిపోతుందని చెప్పారు. 

ఆశపడి దొరికిన చోటల్లా అప్పుచేసి .. ఫీజు చెల్లించుకున్నాడు. చికిత్సలో భాగంగా డాక్టర్లు ముందుగా మొహంలో ఒకవైపు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. మూణ్నెల్ల తర్వాత రెండోవైపు శస్త్రచికిత్స చేశారు. ముందుసారి పర్లేదు కానీ, రెండోసారి సర్జరీ చేసేటప్పుడు మత్తు ఎక్కువ ఇవ్వడంతో వికటించింది. దీంతో మొహంలో మార్పులు మొదలయ్యాయి. రోజురోజుకీ పరిస్థితి మరింత దిగజారి శివ రూపం వికృతంగా మారిపోయింది. గతంలో కంటే అందవిహీనంగా తయారయ్యాడు. చూసేందుకే కాకుండా మానసికంగానూ ప్రవర్తనలో తేడాలు వచ్చాయి. రోజురోజుకీ మతిస్థిమితం లేకుండా పోతోందని తల్లి గమనించింది. 

వెంటనే శస్త్ర చికిత్స్ చేయించుకున్న న్యూ లండన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ వైద్యుల్ని సంప్రదించింది. అయితే డాక్టర్లు తమకెలాంటి సంబంధం లేదంటూ తేల్చేసి.. శివతో పాటు అతడి తల్లిని బయటకు గెంటేశారు. వేరే ఆసుపత్రులకు తిరిగినా ప్రయోజనం లేదు. దీంతో బాధితులు భీమవరం పోలీసులను ఆశ్రయించింది. న్యూ లండన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ద్వారా నష్టపోయమాని తమకు న్యాయం చేయాలని కోరింది. 

ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్న శివ… అందం కోసం అత్యాశకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ సమస్య శివ ఒక్కడే కాదు. ఇప్పటి యువతలో చాలామందిది ఇదే పరిస్థితి. అందంగా లేమన్న ఆలోచనలతో ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. బ్యూటిఫుల్‌గా కనిపించడం కోసం పార్లర్లు, ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. లక్షల రూపాయలు తగలబెట్టడమే కాకుండా… ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు.