ఫైర్ స్టేషన్ దగ్గర దిండు కవర్లు.. విప్పి చూస్తే!

  • Publish Date - February 19, 2020 / 07:53 AM IST

ఇంగ్లాండ్‌లోని సుందర్‌ ల్యాండ్‌ లోని ఫారింగ్‌ డన్ ఫైర్ స్టేషన్ దగ్గర ఓ దిండు పడి ఉంది. ఆ దిండు కదలటం చూసి ఫైర్ స్టేషన్ వాళ్లు వెంటనే పోలీసులకు చెప్పారు. అనంతరం పోలీసులు ఆ స్థలానికి చేరుకుని దిండును జాగ్రత్తగా తీసి చూస్తే దాన్నిండా పాములే పాములు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 16 పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. ఈ ఘటన శనివారం(ఫిబ్రవరి 15, 2020) జరిగింది. కానీ పోలీసులు దిండులో ఉన్న పాముల్నిచూసి ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. అనుమానించారు.

ఎందుకంటే అదే ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం కొన్ని పాముల్ని పడి ఉండటం వాళ్లు చూశారు. కానీ రెండవసారి కూడా అదే ప్రాంతంలో పాములు పడి ఉండటంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిండు కవర్లో 16 పాములు ఉన్నాయి. అందులో 15 కార్న్ పాములు, ఒక మగ కార్పెట్ పైథాన్ పాము ఉన్నట్లుగా గుర్తించారు. 

గతవారం అదే స్థలంలో 13 పైథాన్లు కనుగొనబడ్డాయని రాయల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (RSPCA) ఒక ప్రకటనలో తెలిపింది. ఆ 16 పాములను పశువైద్యుల దగ్గరకు తీసుకెళ్లినట్టు RSPCA ఇన్స్పెక్టర్ హైడి క్లీవర్ తెలిపారు. ఈ క్రమంలో క్లీవర్ మాట్లాడుతూ.. గురువారం రోజు అదే స్థలంలో 13 పాములను కనుగొన్నాము. ఇప్పుడు మళ్లీ అదే స్థలంలో 16 పాములు కనిపించాయి. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారని ఇంకా తెలియలేదని తెలిపారు.