Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఘటనపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు.

Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Pawan

Pawan on Amalapuram: అమలాపురంలో మంగళవారం నాడు చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈమేరకు జనసేన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అమలాపురం జిల్లాకు కోనసీమ జిల్లా పేరుపెట్టాలంటూ గత కొన్నిరోజులుగా ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. అక్కడక్కడా కొందరు ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేశారు. ఈక్రమంలో మంగళవారం ఒక్కసారిగా నిరసనకారులు రెచ్చిపోయారు. పోలీసులపై ఆందోళనకారుల దాడికి పాల్పడ్డారు. ప్రైవేటు బస్సుకు నిప్పు పెట్టి..పోలీసు వాహనాలపై రాళ్ల దాడి చేశారు. ప్రశాంతంగా ఉన్న కోనసీమ ఒక్కసారిగా భగ్గుమంది. ఈఘటనలో స్థానిక డీఎస్పీ సొమ్మసిల్లి పడిపోగా ఎస్పీకి, ఇతర పోలీసు సిబ్బందికీ గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ ప్రయోగించగా అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అమలాపురాన్ని చుట్టుముట్టిన 10 వేల మంది ఆందోళనకారులు..మంత్రి విశ్వరూప్ కార్యాలయంపై దాడికి పాల్పడి నిప్పంటించారు.

Other Stories:Konaseema Tension : ఆందోళనకారులపై చర్యలు తప్పవు-హోం మంత్రి తానేటి వనిత

ఘటనపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవ భావమే ఉంటుందని పవన్ పేర్కొన్నారు. ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమని, ఆ మహనీయుని పేరుని వివాదాల్లోకి తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్ అన్నారు. అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైందని దుయ్యబట్టారు.

Other Stories:Konaseema Tension : అమలాపురం లో ఉద్రిక్తత-పేరు మార్పుపై రెచ్చిపోయిన ఆందోళనకారులు 

వారి తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి వైసీపీ నేతలు లేని సమస్యలు సృష్టిస్తున్నారని, వాళ్ళ వైఫల్యాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు పవన్. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి ఘటనపై ప్రకటన చేస్తూ జనసేన పేరు ప్రస్తావించడాన్ని పవన్ ఖండించారు. వై.సి.పి.ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేనపై రుద్దకండంటూ పవన్ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు.