YS Sunitha Reddy : వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీ అంటూ పోస్టర్లు .. ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్

కడపజిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత పేరుతో ఫెక్సీలు వెలిసాయి. ఈ ఫ్లెక్సీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఫోటోలతో పాటు సునీతారెడ్డి ఫోటోలున్నాయి.

YS Sunitha Reddy : వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీ అంటూ పోస్టర్లు .. ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్

ys sunitha reddy

YS Sunitha Reddy : కడపజిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత పేరుతో రాత్రికి రాత్రే ఫెక్సీలు వెలిసాయి. ఈ ఫ్లెక్సీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఫోటోలతో పాటు సునీతారెడ్డి ఫోటోలున్నాయి. వారితో పాటు కడపజిల్లా టీడీపీ నేత బీటెక్ రవి ఫోటోతో పాటు ఇతర టీడీపీ నేతల ఫోటోలు కూడా ఉన్నాయి. వైఎస్ సునీత రాజకీయాల్లోకి వస్తున్నారంటూ రాత్రికి రాత్రే వెలిసిన ఫ్లెక్సీలు ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్ ను రాజేసింది. రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న డాక్టర్ వైఎస్ సునీతమ్మగారికి స్వాగతం సుస్వాగతం అంటూ ఫ్లెక్సీల్లో రాసి ఉన్నాయి.

కడప జిల్లాలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. తండ్రి హత్యకు కారణమైనవారికి శిక్ష పడాలనే సంకల్పంతో వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి పోరాటం చేస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందుతులుగా ఉన్నది వైఎస్ కుటుంబ సభ్యులే అయినా సునీత మాత్రం తన తండ్రి హత్యలో నిందుతులు ఎవరైనా వారికి శిక్ష పడాలనే ధ్యేయంతో పోరాడుతున్నారు. ఈ పోరాటంలో తనకు..తన కుటుంబానికి హాని ఉందని తెలిసినా..చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినా ఆమె ఏమాత్రం భయపడకుండా సుప్రీంకోర్టు వరకు పోరాటాన్ని తీసుకెళ్లారు.

తాజాగా ఈ కేసులో ప్రధాన నిందుతులు అయినా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు సునీతారెడ్డి. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను కొట్టివేసింది. అవినాశ్ రెడ్డి అరెస్టుకు సీబీఐకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఈ కేసు విచారణకు గడువును కూడా పెంచింది.

ఈక్రమంలో అవినాశ్ రెడ్డికి ఇక అరెస్ట్ భయం పెరిగిందనే చెప్పాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్ తో హైదరాబాద్ నుంచి పులివెందులకు పయనమయ్యారు అవినాశ్ రెడ్డి. మధ్యాహ్నాం సీఎంవోలో ప్రజాదర్భార్ నిర్వహించటానికి సిద్ధమయ్యారు. ఈక్రమంలో ప్రొద్దుటూరులో సునీత రాజకీయ రంగ ప్రవేశం అంటే వెలసిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి.