Rajinikanth : చంద్రబాబు అరెస్ట్ పై రజనీకాంత్ రియాక్షన్, కీలక వ్యాఖ్యలు చేసిన సూపర్ స్టార్

ప్రస్తుత పరిస్థితుల్లో మనోనిబ్బరంతో ఉండాలని లోకేశ్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ ధైర్యం చెప్పారు. Rajinikanth

Rajinikanth : చంద్రబాబు అరెస్ట్ పై రజనీకాంత్ రియాక్షన్, కీలక వ్యాఖ్యలు చేసిన సూపర్ స్టార్

Rajinikanth

Rajinikanth – Chandrababu Arrest : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఆయన మిత్రుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. నారా లోకేశ్ కు ఫోన్ చేసి మాట్లాడారు రజనీకాంత్. ప్రస్తుత పరిస్థితుల్లో మనోనిబ్బరంతో ఉండాలని లోకేశ్ కు ధైర్యం చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు పోరాటయోధుడు అన్న రజనీకాంత్.. త్వరలోనే ఆయన జైలు నుంచి బయటకు వస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు రక్ష అని రజనీకాంత్ చెప్పారు.

చంద్రబాబు జైలుకెళ్లిన దగ్గరి నుంచి జాతీయ స్థాయిలో అనేకమంది లోకేశ్ కు ఫోన్ చేసి బాసటగా నిలుస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటున్నారు. రాజకీయ కక్ష సాధింపు కరెక్ట్ కాదంటున్నారు. ఇప్పటికే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ చంద్రబాబుకి అండగా నిలిచారు. చంద్రబాబు అరెస్ట్ ని వారు ఖండించారు.

Also Read: చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో టీడీపీపై ఏపీ ప్రజల్లో..: బండి సంజయ్

తాజాగా రజనీకాంత్ సైతం చంద్రబాబు అరెస్ట్ ని ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు పని చేశారని అటువంటి వ్యక్తి అరెస్ట్ కావడం దురదృష్టకరం అని రజనీకాంత్ వాపోయారు. నారా లోకేశ్ కి ఫోన్ చేసి ధైర్యం కూడా చెప్పారు. గత రెండు రోజుల నుంచి కూడా జాతీయ స్థాయి నేతల నుంచి ఫోన్లు వస్తున్నాయి.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అక్రమాలు చేశారనే ఆరోపణలతో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయి నాయకులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ ను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఖండించారు.

చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్య మాదిరిగానే కనిపిస్తోందని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తప్పు జరిగితే మాట్లాడి, విచారణ జరిపించాలి అంతేకానీ ప్రతీకారంతో ఏదీ చేయకూడదని ఆమె హితవు పలికారు. ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ఇప్పుడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ట్రెండ్‌గా మారిందని అఖిలేష్ యాదవ్ హాట్ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టడం నిరంకుశ పాలకుల విధానమని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకు తావు లేదన్నారు. రాజకీయాల్లో ఇలాంటి విషయాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీజేపీ, వారి అవకాశవాద స్నేహితులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. స్వార్థపూరిత బీజేపీ ఎవరికీ రాజకీయ మిత్రుడు కాదని అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.

Also Read: చంద్రబాబు అరెస్ట్‌పై అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు.. వారికి పుట్టగతులు ఉండవంటూ ఆగ్రహం

మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ అన్నారు. ఆధునిక ఏపీ రూపశిల్పిగా పేరొందిన చంద్రబాబును బూటకపు ఆరోపణలతో అరెస్టు చేశారన్నారు. ఇటువంటి ప్రతీకార చర్యలు ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. ఇలాంటి ఘటనలను అందరూ వ్యతిరేకించాలన్నారు.

చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన విధానం సరైనది కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే సీఎంగా సుదీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తిని, ప్రతిపక్ష నేతను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సరికాదన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయడంతో టీడీపీకి ప్రజల్లో సానుభూతి పెరిగిందన్నారు. అవినీతికి పాల్పడినట్టు ఆధారాలుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.