Russia Ukraine Conflict : రష్యా యుద్ధాన్ని కోరుకోవడం లేదు.. కానీ, దాడికి అవకాశం ఉంది : పుతిన్

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు క్రమంగా చెదిరిపోతున్నాయి. రష్యా–ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో తాము యుద్ధం కోరుకోవడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు.

Russia Ukraine Conflict : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు క్రమంగా చెదిరిపోతున్నాయి. రష్యా–ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో తాము యుద్ధం కోరుకోవడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు. కానీ, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసేందుకు అవకాశం ఉందనే సంకేతాన్ని ఇచ్చారు. సైనిక విన్యాసాల వ‌ల్లే ఉక్రెయిన్‌పై ర‌ష్యా ఏ క్షణమైన దాడికి దిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వ్యాపించాయి. అయితే ప‌శ్చిమ దేశాల దౌత్యంతో రష్యా వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పుతిన్ ఉక్రెయిన్‌తో వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చర్చలకు సిద్ధమని ప్రకటించారు.

ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల నుంచి రష్యా తమ బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకున్న తర్వాత పుతిన్ ఈ ప్రకటన చేశారు. రెండు దేశాల స‌రిహ‌ద్దుల‌ వ‌ద్ద ల‌క్ష‌లాది మంది సైనికుల‌ను ర‌ష్యా మోహ‌రించిన విష‌యం తెలిసిందే. కొన్ని ద‌ళాల‌ను మాత్రం త‌మ బేస్ క్యాంపుల‌కు పంపిస్తున్న‌ట్లు ర‌ష్యా వెల్లడించింది. ద‌క్షిణ‌, ఉత్త‌ర సైనిక ప్రాంతాల్లోని బ‌ల‌గాల‌ను వెన‌క్కి పంపిన‌ట్లు ర‌ష్యా అధికారులు పేర్కొన్నారు. డ్రిల్స్ పూర్తి చేసుకున్న త‌ర్వాత రష్యా ద‌ళాలు కొన్ని స‌రిహ‌ద్దుల నుంచి వెన‌క్కి మ‌ళ్లిన‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి తెలిపారు. మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని, ఉక్రెయిన్ సరిహద్దు నుంచి కొన్ని రష్యా బలగాలు తరలిపోయాయన్న నివేదికలను అమెరికా ఇంకా ధృవీకరించలేదని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు.

పశ్చిమ దేశాలతో దౌత్యంతోనే వెనక్కి..
వారాలు తరబడి నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఉక్రెయిన్ సరిహద్దు నుంచి రష్యా దళాలను ఉపసంహరించుకోవడం ప్రారంభించినట్లు రష్యా చెప్పిన కొన్ని గంటల తర్వాత.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐరోపాలో యుద్ధాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో చర్చల అనంతరం జాయింట్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన పుతిన్.. పశ్చిమ దేశాలతో దౌత్యం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా, నాటో మిత్రదేశాలతో విశ్వాసాన్ని పెంపొందించడంపై చర్చించడానికి మాస్కో సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

రష్యా మరింత కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. చర్చలకు దిగేందుకు తాము సిద్ధమేనని రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశారు. క్షిపణులు, సైన్యాల మోహరింపును పరస్పరం తగ్గించుకుంటామని చెప్పారు. అమెరికా, నాటోతో మాట్లాడతామని స్పష్టం చేశారు. జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ స్కొల్జ్‌తో భేటీ అనంతరం పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ను, మాజీ సోవియట్‌ దేశాలను నాటోలో చేర్చుకోవద్దని రష్యా ప్రధాన డిమాండ్‌.. అయితే ఈ డిమాండ్‌కు అమెరికా, నాటో అంగీకరించలేదు. ఉక్రెయిన్‌ నాటోలో చేరడం రష్యా భద్రతకు పెద్ద ముప్పుగా భావిస్తోంది. తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు పుతిన్.. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కు మళ్లిస్తున్నట్టు రష్యా సంకేతాలిచ్చింది.

రష్యాకు ఇలాంటి కవ్వింపులు అలవాటే..
యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలను ట్రైన్లపైకి ఎక్కిస్తున్న ఫొటోలను విడుదల చేసింది. సైన్యం ఎక్కడకు వెనక్కు మళ్లుతోంది వంటి వివరాలపై మాత్రం రష్యా పెదవి విప్పలేదు. రష్యా ప్రతి చర్యను అమెరికా, యూరప్‌ దేశాలు గమనిస్తున్నాయి. ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగవచ్చనే అనుమానిస్తున్నాయి. అదే జరిగితే తీవ్ర ఆంక్షలు తప్పవని అమెరికా, ఇంగ్లండ్, నార్వే మరోసారి రష్యాను కఠినంగా హెచ్చరించాయి. ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి రష్యా యుద్ధ సన్నాహాలు కొనసాగుతున్నాయి. ప్రధాన కమాండ్‌ నుంచి చిన్న చిన్న యూనిట్లుగా విడిపోయి ముందుకు కదులుతూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయిని అమెరికా రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి కవ్వింపు ప్రకటనలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం రష్యాకు అలవాటేనని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ద్మిత్రో కులేబా ఆరోపించారు. పూర్తి స్థాయిలో ర‌ష్యా త‌మ‌పై యుద్ధానికి రాబోద‌ని ఉక్రెయిన్ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది.

రష్యా తన బలగాలను ఉపసంహరించుకుందనే వార్త ఉక్రేనియన్లకు ఒక నిట్టూర్పుగా అనిపించింది.. పాశ్చాత్య దేశాలు సాక్ష్యాలు లేకపోవడంతో జాగ్రత్తగా గమనిస్తున్నాయి. రష్యా బలగాలు నిజంగా ఉపసంహరించుకుంటే అది సానుకూల సంకేతమని ఒక ఫ్రెంచ్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. రష్యాకు వ్యతిరేకంగా నిరోధక ప్రయత్నాలు పనిచేస్తున్నట్లు కనిపించాయని, ఏదైనా రష్యా బలగాల ఉపసంహరణ నిజమో కాదో చూడాలని ఉక్రెయిన్ తెలిపింది. రష్యా ఇప్పటికే 2014లో ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న క్రిమియన్ ద్వీపకల్పాన్ని తన కంట్రోల్లోనే ఉంచుకుంది.

Read Also :  Russia-Ukraine : ఏ క్షణమైనా ఉక్రెయిన్ పై రష్యా దాడి..అడుగు ముందుకేస్తే తీవ్ర పరిణామలు తప్పవని అమెరికా వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు