అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం ఎప్పుడు.. నాసా ఏం చెబుతోంది?

మిషన్ పూర్తి చేసుకున్న ఇద్దరు వ్యోమగాములు జూన్ 14న అంతరిక్ష కేంద్రం నుంచి రిటర్న్ రావాలి. అయితే సునీతా విలియమ్స్ మిషన్ ప్రయోగానికి ముందే హీలియం గ్యాస్‌ లీక్ అవుతోందని నాసాకు తెలుసన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Sunita Williams: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. మరో వ్యోమగామి విల్‌మోర్‌తో కలిసి జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు చేరుకున్న సునీతా విలియమ్స్.. తిరుగు ప్రయాణానికి ఇబ్బంది రావడంతో ల్యాండింగ్ వాయిదా పడింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చేరుకున్న సునీత, బ్యారీ విల్‌మోర్‌.. షెడ్యూల్ ప్రకారం జూన్ 14న భూమికి తిరుగుపయనం కావాల్సిఉంది. కానీ, బోయింగ్ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో వాయిదా వేశారు. దీంతో జూన్‌ 26న తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ షెడ్యూల్ చేసింది. కానీ, మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది.

తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు
స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్‌ లీక్ అయింది. ఈ లీక్‌ కారణంగా సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం నిలిచిపోయింది. ఈ వ్యోమనౌకలో హీలియం లీకేజీతో పాటు మరికొన్ని సమస్యలు రావడంతో ఆమె అక్కడే ఉండిపోయారు. దీంతో నాసా ఇంజనీర్లు ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మెయిన్‌గా గ్యాస్ లీకేజీ ప్రాబ్లమ్ వల్లే సునీతా విలియమ్స్ తిరుగు పయనం ఆలస్యమైందని చెప్తున్నారు. జూన్ 26న భూమిపై తిరిగి వస్తారని నాసా కొద్ది రోజుల క్రితం ప్రకటించినప్పటికీ, ఈ ప్రక్రియ మరోసారి వాయిదా పడింది.

డేంజర్ సిచ్యువేషన్‌లో..
మిషన్ పూర్తి చేసుకున్న ఇద్దరు వ్యోమగాములు జూన్ 14న అంతరిక్ష కేంద్రం నుంచి రిటర్న్ రావాలి. అయితే సునీతా విలియమ్స్ మిషన్ ప్రయోగానికి ముందే హీలియం గ్యాస్‌ లీక్ అవుతోందని నాసాకు తెలుసన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది పెద్ద సమస్యగా భావించని నాసా.. సునీతా విలియమ్స్‌ను స్పేస్ టూర్‌కు పంపినట్లుగా చర్చ జరుగుతోంది. మరోవైపు స్టార్‌లైనర్ ఇంధన సామర్థ్యం 45 రోజులు మాత్రమే. ఈ మిషన్ జూన్ 5న ప్రారంభమైంది. దీని ప్రకారం ఇప్పటికే 22 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు కేవలం ఇంకా 23 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ లోగా సునీతా విలియమ్స్ భూమికి చేరుకోవాలి. లేకపోతే ఆమె డేంజర్ సిచ్యువేషన్‌లో ఉన్నట్లే.

స్పేస్ సెంటర్‌లో చిక్కుకున్న సునీతా విలియమ్స్
బోయింగ్ స్టార్‌లైనర్‌లో హీలియం లీక్ కావడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, ఆమె సహోద్యోగి బుచ్ విల్మోర్‌లను రక్షించడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ముందుకొచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాసా, బోయింగ్ అధికారులు మాత్రం ఇప్పటికైతే స్పేస్ ఎక్స్ హెల్ప్ అవసరం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు వ్యోమగాములను సేఫ్‌గా తీసుకొచ్చేందుకు నాసా కృషి చేస్తుందని స్టార్ లైనర్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ చెప్తున్నారు. స్పేస్ సెంటర్ నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ రిటర్న్ జర్నీకి సంబంధించి కూడా కొత్త తేదీని ఇంకా ఖరారు చేయలేదు. కానీ అంతా అనుకున్నట్లు జరిగితే..అన్నీ అనుకూలిస్తే జులై 6న ల్యాండింగ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

రోదసిలో సైతం బోయింగ్‌..
మరోవైపు సివిల్ ఏవియేషన్ ఫీల్డ్‌లో ఎంతో ట్రాక్ రికార్డు ఉన్న.. పేరొందిన బోయింగ్‌.. వరుస ప్రమాదాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. 2018, 2019లో బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు ఘోర ప్రమాదానికి గురయ్యాయి. దాంతో పలు దేశాలకు చెందిన విమానయాన కంపెనీలు ఆ ఫ్లైట్లను వాడటం నిషేదించాయి. బోయింగ్ లోపాలను సరి చేయడంతో 20 నెలల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేశాయి ఏవియేషన్ కంపెనీలు. ఆ తర్వాత బోయింగ్‌ కంపెనీకి చెందిన ఇతర మోడల్‌ విమానాలు కూడా తరచుగా ఏదో ఒక ప్రమాదానికి గురై వార్తల్లోకెక్కడంతో ఆ సంస్థ పేరెత్తితేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రోదసిలో సైతం బోయింగ్‌ వ్యోమనౌక రకరకాల లోపాలతో ఇబ్బంది పెట్టడంతో మరోసారి చర్చనీయాంశం అయింది.

Also Read: అయితే మాడుపగిలే ఎండలు, లేదంటే ముంచేసే వరదలు.. ఎందుకిలా? భూమి మీద అసలేం జరుగుతోంది?

మూడో అంతరిక్ష యాత్ర
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు ఇది మూడో అంతరిక్ష యాత్ర. 1998లో నాసాకు ఎంపికైన తర్వాత ఆమె తొలిసారి 2006లో రోదసి యాత్ర చేశారు. 2012లో మరోసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఇప్పటివరకు మొత్తం ఆమె 50 గంటల 40 నిమిషాల స్పేస్ వాక్ చేశారు. 322 రోజుల పాటు ఆమె అక్కడ గడిపారు. ఈ మధ్యే మూడోసారి అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సందర్భంలో సునీత విలియమ్స్ చేసిన డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను ఆలింగనం చేసుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Also Read: అంతరిక్ష శిథిలాల వల్ల తమ ఇల్లు దెబ్బతిందని కేసు వేసిన కుటుంబం

ఎక్స్‌పర్ట్స్‌ ఏమంటున్నారు?
స్పేస్ టూర్ అనేది అంత సింపుల్ కాదు. అంతరిక్షంలో పరిస్థితులు కూడా ఎప్పుడు ఒకేలా ఉండవు. స్పేస్‌లో లిమిటెడ్ టైమ్‌కు మించి గడపలేమని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. వ్యోమనౌకలో ఉన్న ఫెసిలిటీస్ బట్టి ఎన్ని రోజులు సేఫ్‌గా స్పేస్‌లో ఉంటామనేది డిసైడ్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు. సరిపడా ఆక్సిజన్ సిలిండర్స్, వ్యోమనౌక ట్రావెల్ చేయడానికి ఇంధనం అవసరం. దీంతో పాటు ఎక్కువసేపు స్పేస్‌లో ఉంటే వ్యోమగాములకు ఆరోగ్యం దెబ్బతింటుందని.. ఎంత ఫిట్‌గా ఉన్నా కండరాలు దెబ్బతినడం, తొందరగా వీక్ అవడం, బ్రీతింగ్ సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. అందుకే లిమిటెడ్ టైమ్‌కు మించి వ్యోమగాములు అంతరిక్షంలో ఉండటం సేఫ్ కాదనేది ఎక్స్‌పర్ట్స్‌ మాట.

ట్రెండింగ్ వార్తలు