వైజాగ్ వారియర్స్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో రాయలసీమ కింగ్స్ ఓటమి

విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వైజాగ్ వారియర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Andhra Premier League 2024: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ 2024లో రాయలసీమ కింగ్స్ తమ రెండో మ్యాచ్‌లో వైజాగ్ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వైజాగ్ వారియర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టుకు సరైన ఆరంభం లభించలేదు. మూడో ఓవర్లోనే ఓపెనర్‌‌ డీబీ ప్రశాంత్ కుమార్‌ వికెట్ కోల్పోయింది.

హనీష్ రెడ్డి, రోషన్ కుమార్ రెండో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. అయితే పవర్‌ప్లే చివరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోవడంతో కింగ్స్ జట్టు మళ్లీ వెనుకంజ వేసింది. వైజాగ్ వారియర్స్ బౌలర్ గవ్వల మల్లికార్జున మిడిల్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. కింగ్స్ తరఫున గుత్తా రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి 11 బంతుల్లోనే 21 పరుగులతో ఆకట్టుకున్నాడు. షేక్ కమరుద్దీన్ కూడా వేగంగా ఆడి 12 బంతుల్లో 19 రాబట్టడంతో కింగ్స్ 130 పరుగుల మార్కు దాటింది.

అనంతరం వైజాగ్ వారియర్స్‌ 14.5 ఓవర్లలోనే 131/2 స్కోరు చేసి లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. తొలుత 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు బండారు సుజాన్‌ ఒక్క పరుగుకే ఔట్‌ అవ్వడంతో కింగ్స్‌కు మంచి ఆరంభం లభించింది. అశ్విన్ హెబ్బర్ (56), శ్రీకర్ భరత్ (47 నాటౌట్‌) వైజాగ్ వారియర్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. చివర్లో మువ్వల యువన్ (6 18 నాటౌట్)తో కలిసి భరత్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌ తర్వాత రాయలసీమ కింగ్స్‌ తమ ఆటలో చాలా మెరుగవ్వాల్సి ఉంది. ప్రత్యేకించి వారి ఫీల్డింగ్‌ను వేగంగా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. ఇదే వేదికపై బుధవారం సాయంత్రం 6.30 గంటలకు గోదావరి టైటాన్స్‌తో రాయలసీమ కింగ్స్ తలపడుతుంది.

స్కోర్‌‌బోర్డ్:
ఆర్‌‌కే : 20 ఓవర్లలో 130/9 (కె. హనీష్ రెడ్డి 22, గుత్తా రోహిత్ 21)
వీజెడ్‌బ్ల్యూ బౌలర్లు: కె సుదర్శన్ 4-1-17–-3, జి. మల్లికార్జున 4-0-15-3

వీజెడ్‌బ్ల్యూ: 14.5 ఓవర్లలో 131/2 (అశ్విన్ హెబ్బర్ 56, శ్రీకర్ భరత్ 47నాటౌట్‌)
ఆర్కే బౌలర్లు: జి. రెడ్డి 3-0-–35-1, ఎస్. కమరుద్దీన్ 2–0–18-1

ట్రెండింగ్ వార్తలు