Eatala-Gangula : హత్యా రాజకీయాలపై ఈటల, గంగుల మాటల యుధ్ధం

తనను హత్యచేసేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి హంతక ముఠాలతో సంప్రదింపులు చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. ఈటల వ్యాఖ్యలను మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు.

Eatala-Gangula : తనను హత్యచేసేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి హంతక ముఠాలతో సంప్రదింపులు చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. ఈటల వ్యాఖ్యలను మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని…. ఒకవేళ ఆరోపణలను నిరూపించలేకపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటావా అని గంగుల ఈటలను ప్రశ్నించారు.

ఈ విషయమై సీబీఐ విచారణ జరిపించాలని గంగుల డిమాండ్ చేశారు. ఎవరైనా ఈటలపై హత్యాయత్నం చేస్తే… నా ప్రాణాలు అడ్డువేసి ఈటలను కాపాడుకుంటానని గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. నీ ప్రాణాలు కాపాడతాను, కానీ రాజకీయంగా మాత్రం నిన్ను అణగదొక్కుతామని గంగుల హెచ్చరించారు. ప్రజల్లో సానుభూతి కోసమే ఈటల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

ఈటల చేసేది పాదయాత్ర కాదని..గడియారాల పంచుడు యాత్ర అని గంగుల విమర్శించారు. ఆయన ఓడిపోతానని తెలిసి ఫ్రస్టేషన్ లోనే అలా మాట్లాడుతున్నారని గంగుల కమలాకర్ చెప్పారు. ఓటమి నుంచి ప్రజలను డైవర్ట్ చేయటం కోసమే ఇలా వ్యాఖ్యాలు చేసారని అన్నారు. ఈటల దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని… బీసీ లంటే ఈటలకు పడదని గంగుల ఆరోపించారు. ఈటల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు సీబీఐ ఎంక్వైరీ చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషి ఎవరో తేలితే వారు రాజకీయాలనుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

హుజూరాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక సందర్భంగా మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈ రోజు ఉదయం సంచలన వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. ప్రజాదీవెన యాత్ర పేరుతో ఈరోజు నుంచి ఈటల హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను చంపటానికి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి హంతక ముఠాలతో సంప్రదింపులు చేస్తున్నారని ఆరోపిస్తూ….‘అరె కొడుకుల్లారా ఖబర్దార్..? నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు.. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను… ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని, ఈటల మల్లయ్య కొడుకుని ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా.. దుబ్బాకలో ఎం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది.. అని తీవ్ర స్ధాయిలో వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్ రజాకార్ల పాలనను తలపిస్తున్నారని ఆయన అన్నారు. 2018 ఎన్నికల్లో నన్ను ఓడించటానికి ఎన్ని కుట్రలు చేసినా నియోజక వర్గ ప్రజలు నాకు అండగా ఉండి గెలిపించారు… ఇప్పుడు నిలుస్తారు… నాకు చట్టం మీద నమ్మకం.. విశ్వాసం ఉంది.. పోలీసులు సహకరించండి అని ఈటల అన్నారు.

మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎత్తులకు పైఎత్తులు అన్నట్లుగా నడుస్తోంది. ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల మాటల వెనక ఉన్నది వాస్తవమా.. రాజకీయమా ? అని ఆలోచిస్తే …ఈటల చేసి వ్యాఖ్యలు రాజకీయంగా మరింత కాక రగిలించాయ్. పబ్లిక్ మీటింగ్‌లో ప్రజాప్రతినిధిగా సుధీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి వాడకూడని మాటలు.. వాడేశారు. ఒకే పదం పదేపదే వాడుతూ.. తన ఆక్రోశం బయటపెట్టారు. ఇంతకీ ఆయన ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నా.. ఎందుకు అన్నా.. ఒక్కటి మాత్రం నిజం. ఈటల గురి మారింది. ఆత్మగౌరవం కోసం పోరాడడానికి బదులు.. సానుభూతి కోసం ఆరాటపడుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది.

ఒకవేళ నిజంగా ఈటల హత్యకు కుట్ర జరుగుతోందని సమాచారం ఉంటే.. దాని గురించి బయటపెట్టే విధానం, వేదికలు వేరే ఉంటాయ్. ఇలా పాదయాత్ర మొదటిరోజే సంచలన వ్యాఖ్యలు అంటే.. అటెన్షన్ తన మీదకు డైవర్ట్ చేసుకునేందుకు ఈటల వేసిన ఎత్తుగడ అన్నది టీఆర్ఎస్ వాదన. ఓ సుధీర్ఘమైన ప్రజాప్రతినిధిగా, మంత్రిగా సేవలు అందించిన ఈటలలాంటి వ్యక్తికి ఎలాంటి ఆపద రావొద్దని కోరుకుంటున్నాం.

ఐతే ఇంతకీ కుట్ర జరుగుతుందని చెప్పిన నక్సలైట్ ఎవరు… జిల్లామంత్రి జిల్లా మంత్రి అంటున్నారు.. ఆయన పేరు ఎందుకు బయటపెట్టడం లేదు. నిజంగానే కుట్ర జరిగింది అనడానికి ఆధారాలు ఉంటే.. పోలీసుల మీద విశ్వాసం ఉందన్న మీరు.. ఎందుకు కేసు పెట్టలేదు.. ఆధారాలు ఎందుకు వాళ్ల చేతికి ఇవ్వలేదు.. అక్కడ న్యాయం జరగదని ఒకవేళ మీకు అనిపించినా.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచే అవకాశం మీకుంది. అలా ఎందుకు చేయడం లేదు. రేపో మాపో మీరు కేసు పెట్టకపోతే..మీరు ఎంచుకున్న ఆత్మగౌరవ నినాదం ప్రజల్లోకి చేరక..ఏంచేయాలో తోచక… సానుభూతి కోసం మీరు వేసిన ఎత్తుగడగా భావించాల్సి ఉంటుందనేది క్లియర్ కట్.

ట్రెండింగ్ వార్తలు