తెలంగాణ డీజీపీ కార్యాలయానికి వెళ్లి హత్యపై ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.

తెలంగాణ డీజీపీ కార్యాలయానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, హర్షవర్ధన్ రెడ్డి ఇటీవల వనపర్తి జిల్లా లక్షపల్లిలో చోటుచేసుకున్న ఘటనపై ఫిర్యాదు చేశారు. హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు కూడా వారితో ఉన్నారు.

తెలంగాణ డీజీపీ రవి గుప్తాను కలిసి పలు వివరాలు అందించారు. శ్రీధర్ రెడ్డిని హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని డీజీపీని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.

హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మీద ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవ్వరినీ అరెస్ట్ చెయ్యలేదని విమర్శించారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డీజీపీని కోరామని తెలిపారు.

వారం రోజుల్లో ఈ కేసులో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ మీద ఎలాంటి వివరణ ఇవ్వలేనని ఆయన అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన విషయమని అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో ఎవ్వరు ఉన్నా దర్యాప్తు జరిపించాలని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానికుల పోలీసుల దర్యాప్తు మీద తమకు నమ్మకం లేదని అన్నారు. అందుకే ఇవాళ డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Also Read: డీఫాల్టర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?.. మంత్రి ఉత్తమ్ ను ప్రశ్నించిన మహేశ్వర్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు