ఫోన్ ట్యాపింగ్ కేసు.. సంచలన విషయాలు చెప్పిన రాధాకిషన్ రావు..! త్వరలో రాజకీయ నేతల అరెస్టులు?

దీంతో ఆ నేతల విచారణకు రంగం సిద్ధమవుతోందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మరిన్ని అరెస్ట్ లు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ కేసులో రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ తో మరోసారి దర్యాఫ్తు బృందం స్పీడ్ పెంచింది. ఇప్పటివరకు పోలీసుల చుట్టూ తిరిగిన కేసు ఇప్పుడు రాజకీయ నేతల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. దీంతో ఆ నేతల విచారణకు రంగం సిద్ధమవుతోందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మరిన్ని అరెస్ట్ లు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

ఎవరి ఆదేశాలతో పని చేశారు? ఏం చేశారు?
ఫోన్ ట్యాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం. టాస్క్ ఫోర్స్ ముసుగులో తాను చేసిన అక్రమాలను పోలీసుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. ఎవరి ఆదేశాలతో పని చేశారు? ఏం చేశారు? అనే అంశాలన్నీ తన వాంగూల్మం ద్వారా బయటపెట్టినట్లు తెలుస్తోంది. రాధాకిషన్ రావు ముఖ్యంగా రెండు రకాల అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీల డబ్బును ఎక్కడికక్కడ పట్టుకోవటం, బీఆర్ఎస్ నేతల డబ్బులను ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వ వాహనాల్లో తరలించడం వంటి పనులు చేసినట్లుగా చర్చ జరుగుతోంది.

కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్?
ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు సేకరించిన సమాచారం మొత్తాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు చేరవేసేవాడని సమాచారం. ఎవరు ఎక్కడి నుంచి ఎంత మొత్తాన్ని ఏ రూట్లలో డబ్బును తరలిస్తున్నారు అన్న వివరాలను ట్యాపింగ్ ద్వారా సేకరించిన ప్రణీత్ రావు.. ఆ సమాచారాన్ని ప్రభాకర్ రావుకి చేరవేసే వాడని.. పోలీసుల వాంగ్మూలంలో రాధాకిషన్ రావు చెప్పినట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్ కనుసన్నల్లోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జరిగిన పరిణామాలు రాధాకిషన్ రావు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఐజీ ప్రభాకర్ రావు ముఖ్యనేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు మునుగోడు ఉపఎన్నికపై కూడా కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు రాధాకిషన్ చెప్పినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్, దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచాక.. ఎలాగైనా బీజేపీని మునుగోడులో ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకిషన్ రావు చెప్పినట్లు చర్చ జరుగుతోంది.

బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశం?
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ప్రభాకర్ రావు తనతో చర్చించినట్లు రాధాకిషన్ చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ ముఖ్య నేతలు పైలెట్ రోహిత్ రెడ్డిని సంప్రదించారని, రోహిత్ రెడ్డి కేసీఆర్ కు సమాచారం ఇచ్చారని చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీకి చెక్ పెట్టేందుకు వారికి సర్వైలెన్స్ పెట్టాలని ఎస్ఐబీకి కేసీఆర్ చెప్పినట్లు రాధాకిషన్ తన స్టేట్ మెంట్ లో చెప్పారని సమాచారం. కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పినట్లు తెలుస్తోంది.

బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు టీమ్ ట్యాప్ చేసిందని, ఫోన్ ట్యాప్ ద్వారా ఒక ఆడియో టేప్ ను కేసీఆర్ కు పంపించినట్లు రాధాకిషన్ తన స్టేట్ మెంట్ లో చెప్పినట్లు తెలుస్తోంది. ట్రాప్ కు ఒక రోజుముందు ఫామ్ హౌస్ లో కెమెరాలను ఫిక్స్ చేశామని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలను అందులో పాలు పంచుకోవాల్సిందిగా కేసీఆరే చెప్పారని.. ఆపరేషన్ మొత్తాన్ని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు చూసుకున్నారని రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చారని తెలుస్తోంది.

బీఎల్ సంతోష్ అరెస్ట్ తో కవిత అరెస్ట్ ను అడ్డుకునే ప్లాన్?
బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించారని.. సంతోష్ ను అరెస్ట్ చేసి లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాకుండా, కాంప్రమైజ్ అవుద్దామని కేసీఆర్ అనుకున్నారని.. కానీ, కొంతమంది అధికారుల అసమర్థత కారణంగా సంతోష్ ను అరెస్ట్ చేయలేకపోయామని రాధాకిషన్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. పలువురు అధికారులను కేరళకు పంపించినా.. ప్లాన్ సక్సెస్ కాలేదని, సంతోష్ ను అరెస్ట్ చేయలేకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు చెప్పారని తెలుస్తోంది. కేసీఆర్ తో ఉన్న అనుబంధం కారణంగా ఇంతకంటే ఎక్కువ విషయాలు తాను చెప్పలేనని స్టేట్ మెంట్ లో రాధాకిషన్ రావు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ నేతల అరెస్టులు?
రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగూల్మంలో పలువురు బీజేపీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాధాకిషన్ స్టేట్ మెంట్ లోని అంశాల ఆధారంగా దర్యాఫ్తు బృందం మరోసారి స్పీడ్ పెంచే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం.

Also Read : కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?: బండి సంజయ్

ట్రెండింగ్ వార్తలు