Weather Update : వామ్మో చలి.. మూడ్రోజులు జాగ్రత్త.. 19 జిల్లాల్లో అలర్ట్.. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు.. వాళ్లు బయటకు రావొద్దు
Weather Update : చలి వణికిస్తోంది.. ఉదయం, రాత్రి వేళ్లలో బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. అయితే, వాతావరణ శాఖ హెచ్చరికలు..
Weather Update
Weather Update : చలి వణికిస్తోంది.. ఎముకలు కొరికే చలితో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా చలిని తట్టుకొనేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖసైతం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ముఖ్యంగా 19 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రజలు చలి తీవ్రత నుంచి జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Also Read : Ishan kishan : ఏం కొట్టుడు కొట్టావ్ బ్రో.. ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకం.. వీడియో వైరల్
తెలంగాణ ప్రజలను చలి వణికిస్తోంది. ఉదయం, రాత్రి వేళ్లలో బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పొద్దుపోయే సమయం నుంచి ఉదయం 10గంటల వరకు చలి ఇరగబడుతోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 11.9 డిగ్రీల దిగువన నమోదయ్యాయి. సంగారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో ఏకంగా 6.1 నుంచి 6.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక 19 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఈశాన్య భారతం నుంచి వస్తున్న గాలులతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటోందని.. వచ్చే మూడ్రోజులు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.
చలి గాలులు వీస్తాయని, చాలాచోట్ల ఆరు డిగ్రీలకు దిగువన కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. శనివారం జనగామ మినహా అన్ని జిల్లాలకు, ఆదివారం 22 జిల్లాలకు, సోమవారం 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్, రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో 18 మండలాల్లో, వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో చలి తీవ్రత పెరిగింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 6.1డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రతకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఉదయం, రాత్రి వేళ్లలో బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా చలి తీవ్రతను తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
