మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన చీఫ్ ఇంజినీరింగ్ బృందం.. అధికారులకు కీలక సూచనలు

బ్యారేజీపై కుంగిన వంతెన, ఏడో బ్లాక్ లో దెబ్బతిన్న పియర్స్ పరిశీలించి కుంగుబాటుకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ని చీఫ్ ఇంజినీరింగ్ బృందం పరిశీలించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించింది. బ్యారేజీపై కుంగిన వంతెన, ఏడో బ్లాక్ లో దెబ్బతిన్న పియర్స్ పరిశీలించి కుంగుబాటుకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వాటి ఫుటేజీలను సేకరించారు.

ఇటీవల ఏర్పడిన బొరియ ప్రాంతంతో పాటు కుంగిన పియర్స్, గేట్ల స్థితుగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అటు మేడిగడ్డ బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతంలో ఉన్న తాజా పరిస్థితులను గమనించారు. బ్యారేజీలోని 15 నుంచి 21వ పియర్ల గేట్ల వద్ద ఇసుక మేటలను, గేట్ల రిపేరీ పనులను పరిశీలించారు.

మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం చేసిన సూచనల మేరకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పనులను పర్యవేక్షించేందుకు చీఫ్ ఇంజినీర్ అనిల్ కుమార్ నేతృత్వంలో దాదాపు ఆరుగురి ఇంజినీర్ల బృందం అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించింది.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు గేట్లను గ్యాస్ కట్టర్ తో కట్ చేస్తున్నారు. ఆ పనులన్నింటిని ఇంజినీర్ల బృందం పరిశీలించింది. బ్యారేజీ దిగువున నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తున్న బ్లాకుల పనులను కూడా పరిశీలించారు. వర్షా కాలం రానుంది. పెద్ద ఎత్తున వరదలు వచ్చే అవకాశం ఉంది. ఆలోపే అక్కడ తాత్కాలిక మరమ్మతు పనులన్నీ పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు ఇంజినీరింగ్ అధికారులు.

ఆ మేరకు ఎంత స్పీడ్ గా పనులు జరుగుతున్నాయి అనేది ఇంజినీరింగ్ బృందం పరిశీలిస్తోంది. వరదలు వచ్చే పరిస్థితి ఉందని.. ప్రాణహిత, గోదావరి నదుల్లో ప్రవాహం ఎక్కువగా ఉంటుందని.. ఆ ప్రవాహాన్ని తట్టుకునే విధంగా తాత్కాలికంగా చేపట్టిన మరమ్మతు పనులన్నీ పటిష్టంగా ఉండాలని, ఎలాంటి అవాంతరాలు లేకుండా పనులన్నీ పూర్తవ్వాలని ఇంజినీరింగ్ బృందం సూచించింది.

Also Read : తెలంగాణలో మరోసారి అధికారుల బదిలీ? కీలక శాఖల్లో మార్పులు, చేర్పులు..? కారణం అదేనా

ట్రెండింగ్ వార్తలు