YS Sharmila Arrest: వై.ఎస్. షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు తరలింపు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. మహబూబాబాద్ జిల్లా పోలీసులు ఆమె పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. దీంతో షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

YS Sharmila Arrest: వై.ఎస్. షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు తరలింపు

YS Sharmila

YS Sharmila Arrest: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. స్థానిక ఎమ్మెల్యేపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ ఎమ్మెల్యే వర్గీయులు ఆమె బస చేసిన ప్రాంతం వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు భావించిన పోలీసులు.. షర్మిల పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. ఈ మేరకు పోలీసులు షర్మిలకు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆమెను అరెస్టు చేసిన మహబూబాబాద్ పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

YS Sharmila Padayatra : ఈ నెల 28 నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్న వైఎస్ షర్మిల

షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ షర్మిల పాదయాత్రపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే విమర్శలకు శనివారం మహబూబాబాద్ పట్టణంలో మాట, ముచ్చట కార్యక్రమంలో షర్మిల ఘాటుగా స్పందించింది. దీంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా, ఆదివారం ఉదయం షర్మిల బస చేసిన మహబూబాబాద్ మండలం బేతోలు శివారు సోలార్ తాండా వద్ద భారీ సంఖ్యలో ఎమ్మెల్యే వర్గీయులు, బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షర్మిల ప్లెక్సీలను చింపివేశారు. దీంతో బీఆర్ఎస్, వైఎస్ఆర్టీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శంకర్ నాయక్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ – కురవి జాతీయ రహదారిపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో ఘర్షణలు తలెత్తకుండా భారీ సంఖ్యలో పోలీసులు షర్మిల బసచేసే ప్రాంతం వద్దకు చేరుకున్నారు.

YS Sharmila Padayatra : రంగంలోకి దిగాం..పాదయాత్ర చేస్తాం – షర్మిల

పాదయాత్ర సమయంలో పరుష పదజాలంతో విమర్శలు చేయడంతో పాటు, బీఆర్ఎస్ శ్రేణుల నిరసనతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతున్నక్రమంలో షర్మిల పాదయాత్రకు అనుమతిని పోలీసులు రద్దు చేశారు. షర్మిలను తన కారవాన్‌లోకి వెళ్లి అరెస్టు చేశారు. పోలీస్ వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. షర్మిలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అయితే, పాదయాత్రలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం వల్లనే అనుమతి రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు షర్మిలకు పోలీసులు నోటీసులుసైతం అందజేశారు.