Raj – Koti : కొన్నేళ్ల క్రితం విడిపోయిన రాజ్ – కోటి.. చివరిసారిగా ఇటీవలే కలిసి..

గతంలో ఇద్దర్ని దీని గురించి ప్రశ్నిస్తే మేము వర్క్ పరంగానే విడిపోయాము, సంగీత దర్శకులుగానే విడిపోయాము అంతేకాని ఎప్పటికి స్నేహితులమే, కనిపిస్తే మాట్లాడుకుంటాం అని అన్నారు. అయితే రాజ్ - కోటిలను విడిపోయాక కలపాలని కొంత మంది చూశారు.

Raj – Koti : కొన్నేళ్ల క్రితం విడిపోయిన రాజ్ – కోటి.. చివరిసారిగా ఇటీవలే కలిసి..

Music Director Raj and Koti last time meeting

Raj – Koti :  ప్రముఖ సంగీత దర్శకుడు(Music Director) రాజ్(Raj) నిన్న మే 21 సాయంత్రం మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్ నిన్న సాయంత్రం గుండెపోటుతో హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. రాజ్ – కోటి సంగీత ద్వయం టాలీవుడ్ లో చాలా పాపులర్. రాజ్ పూర్తి పేరు తోటకూర సోమరాజు. మ్యూజిక్ డైరెక్టర్ కోటితో కలిసి రాజ్ దాదాపు 180 సినిమాలకు సంగీతం అందించారు. తెలుగులో రాజ్ – కోటి ద్వయం సూపర్ హిట్ కాంబినేషన్.

చిన్నప్పటి నుంచి కూడా రాజ్ – కోటి మంచి స్నేహితులు. ఇద్దరి తండ్రులు టీవీ రాజు – సాలూరి రాజేశ్వర రావు కూడా సంగీత దర్శకులే. వారిద్దరూ మంచి స్నేహితులు కావడంతో చిన్నప్పటి నుంచే రాజ్ – కోటి కలిసి తిరిగేవారు. సంగీత దర్శకులుగా మరిన తర్వాత ఇద్దరూ విడి విడిగా కొన్ని సినిమాలకు పనిచేసినా అనంతరం ఇద్దరు కలిసి రాజ్ – కోటి సంగీత ద్వయంగా పనిచేశారు. ఓ పదేళ్ల పటు ఇద్దరూ కలిసి టాలీవుడ్ ని ఏలారు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు.

కానీ అనుకోకుండా ఇద్దరూ విడిపోయారు. గతంలో ఇద్దర్ని దీని గురించి ప్రశ్నిస్తే మేము వర్క్ పరంగానే విడిపోయాము, సంగీత దర్శకులుగానే విడిపోయాము అంతేకాని ఎప్పటికి స్నేహితులమే, కనిపిస్తే మాట్లాడుకుంటాం అని అన్నారు. అయితే రాజ్ – కోటిలను విడిపోయాక కలపాలని కొంత మంది చూశారు. మెగాస్టార్, బాలసుబ్రహ్మణ్యం కూడా వీరిద్దర్నీ కలపడానికి ట్రై చేశారు. కానీ వీరు కలిసి పనిచేయలేదు.

విడిపోయిన తర్వాత గతంలో రాజ్ – కోటి లను చెన్నైలోని ఓ కార్యక్రమానికి ఆహ్వానించి సత్కరించారు. ఆ తర్వాత కూడా ఏదో తెలిసిన వాళ్ళ లాగా కనిపిస్తే మాట్లాడుకోవడం తప్ప అంతకుముందులా క్లోజ్ గా ఉండేవారు కాదు. చివరిసారిగా ఇటీవలే బేబీ సినిమాలోని ఓ సాంగ్ లాంచ్ కి విచ్చేశారు. బేబీ సినిమాలోని దేవరాజా అనే సాంగ్ లాంచ్ ఇటీవల జరగగా సినీ పరిశ్రమలోని సీనియర్ సంగీత దర్శకులు చాలా మందిని ఆహ్వానించారు. వారిలో రాజ్ కోటి కూడా ఉన్నారు. చాలా రోజుల తర్వాత రాజ్ కోటి బయట ఒక ఈవెంట్ లో కలిసి కనిపించారు. ఈ ఈవెంట్ లో రాజ్ కోటి పక్కన కూర్చొని కనిపించారు. అయితే గతంలో ఉన్నంత క్లోజ్ గా మాత్రం మాట్లాడుకోలేదని, కేవలం నవ్వుతూ పలకరించుకొని కాసేపు మాట్లాడుకున్నారని సమాచారం. ఇక చివరిసారిగా రాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆ పాట గురించి బాగుందని మాట్లాడారు. దీంతో రాజ్ చివరిసారిగా మాట్లాడిన స్పీచ్ వైరల్ గా మారింది.

Music Director Raj : సంగీత దర్శకుడు రాజ్ మరణంపై సినీ ప్రముఖుల నివాళులు..

రాజ్ మరణంపై కోటి మాట్లాడుతూ.. చివరిసారిగా బేబీ సినిమా సాంగ్ లాంచ్ లోనే కలిశాం. అప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు, బాగానే మాట్లాడుకున్నామని తెలిపి ఎమోషనల్ అయ్యాడు.