Revanth Reddy : మీడియాలో వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు నిజం కావు, ఆ అధికారులను వదిలిపెట్టం- రేవంత్ రెడ్డి

గత ఆరు నెలల నుండి జరిగిన టెండర్లు, నిర్ణయాలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమీక్షిస్తాం. Revanth Reddy

Revanth Reddy Warning

Revanth Reddy – Assembly Elections 2023 : ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమాగా చెప్పారు. హైదరాబాద్ గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పీఏసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఇక, మీడియాలో వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు నిజం కావని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒక ప్రాసెస్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు.

”పలు రాజకీయ పార్టీలతో పొత్తులపై చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. పార్టీకి సేవ చేసిన వారికి సముచిత గౌరవం ఇస్తాం. ఎమ్మెల్యే టికెట్లు మాత్రమే ప్రకటిస్తున్నాం. ఇంకా అనేక పదవులు, అవకాశాలు ఉంటాయి. జానారెడ్డి, ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ అధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నాం. పార్టీ కోసం పని చేసిన వారి విషయంలో నిర్ణయాలు, సూచనలు ఇవ్వడానికి ఈ కమిటీ పని చేస్తుంది.

Also Read : పొత్తులపై కామ్రేడ్లు కన్ఫ్యూజన్ లో పడిపోయారా.. ఎందుకీ పరిస్థితి?

రాష్ట్రంలో కొందరు అధికారులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా ఆ పార్టీ కోసం పని చేస్తున్నారు. రాష్ట్ర డీజీపీ ఏపీ క్యాడర్ ఆఫీసర్. స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు లాంటి అధికారులు ఒకే పదవిలో పలు సంవత్సరాలుగా ఉన్నారు. కొందరు సీఐలు అత్యుత్సాహం చూపిస్తున్నారు. అధికారులు ఆర్థిక నియంత్రణ పాటించాలి. బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా పని చేస్తున్న అధికారులను వదిలిపెట్టం. అధికారులకు సంబంధించిన పలు కీలక అంశాలను పీఏసీలో చర్చించారు. ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారుల నియంత్రణ కోసం ఒక కమిటీ నియమించాం.

తప్పుడు వార్తలు వేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెడతాం. పార్టీలకు బాకా ఊదుతున్న వార్తలను పెయిడ్ వార్తలుగా పరిగణించాలి. కేసీఆర్ దొరికినోనికల్లా పదవి ఇస్తున్నారు. అవి చెల్లవు. గత ఆరు నెలల నుండి కేసీఆర్ భర్తీ చేసిన పదవులను రద్దు చేయాలి. కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. గత ఆరు నెలల నుండి జరిగిన టెండర్లు, నిర్ణయాలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమీక్షిస్తాం. ఎన్నికల హోర్డింగులు తదితర చోట్ల ప్రతిపక్షాలకు స్థానం లేకుండా చేస్తున్నారు. మెట్రో హోర్డింగుల్లో కూడా అన్ని పార్టీలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి” అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read : హోరాహోరీగా సూర్యాపేట రాజకీయం.. కాంగ్రెస్ తలరాత మారుతుందా?

ట్రెండింగ్ వార్తలు