Tobacco Farming
Tobacco Farmers : వాణిజ్య పంటల్లో ప్రధానమైన పొగాకు ఈసారి రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ డిమాండ్ అధికంగానే ఉండటం, దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. అయితే పెరిగిన పెట్టుబడుల మేరకు ధరలు లేకపోవటం పొగాకు రైతుల్ని నిరుత్సాహానికి గురిచేస్తోంది. పొగాకు ద్వారా మన దేశానికి అతిఎక్కువ విదేశీ మారకద్రవ్యం వస్తున్నప్పటికీ… ఆ మేరకు లాభాలు రావటం లేదని వాపోతున్నారు.
READ ALSO : Tobacco Farming : తగ్గుతున్న పొగాకు సాగు విస్తీర్ణం… పొగాకు రైతులకు ఫలితం దక్కేనా..?
ఆరుగాలం శ్రమించి.. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి.. సాగుచేసిన పంట అమ్మకానికి వచ్చేసరికి, ఆశించిన ధర లేక రైతులు దిగాలు పడుతున్నారు. ఎన్నోకష్టాలకోర్చి పండించిన పంట అమ్మకానికి వెళ్లిన తరువాత వ్యాపారి నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. గతేడాది అనుకున్నదానికంటే ఎక్కువ ధర పలకడంతో ఈ సారి సాగు విస్తీర్ణం పెరిగింది.
పంట నాట్ల సమయంలో బాగానే ఉన్నప్పటికీ మధ్యలో తుఫాను కారణంగా కొంత మేర పంట దెబ్బతింది. అయినాసరే గతంలో కంటే ఎక్కువగానే దిగుబడి వస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఎరువులు, పురుగుమందులు, కూలీఖర్చులు పెరిగాయి. 2021 – 2022 లో సరాసరి కిలో ధర సుమారు రూ. 185 పలికింది. ప్రస్తుతం కిలో ధర రూ. 200 పలుకుతుంది.
READ ALSO : Groundnut : రబీ వేరుశనగలో పొగాకు లద్దె పురుగు నివారణ!
ఈ ఏడాది పెరిగిన ఖర్చులను బట్టి చూస్తే ఆ ధర సరిపోదని .. కనీసం సరాసరి కిలో ధర రూ. 250 వరకు ఇవ్వాలని పొగాకు రైతులు కోరుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి సాగు ఖర్చులు 40 శాతం పెరిగాయి. ఏటా ప్రారంభంలో లేదా చివర్లో అధిక ధర ఇచ్చేవారు. దీంతో చాలామంది రైతులు నష్టపోతున్నారు. మొదటి నుండి ఒకే రకమైన ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల చిన్న, పెద్ద రైతులకు నష్టం ఉండదంటున్నారు.