Elephant Foot Yam : కంద సాగుతో మంచి ఆదాయం – అధిక దిగుబడుల కోసం యాజమాన్య పద్ధతులు 

కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దుంపలను నాటగా.. ప్రస్తుతం నాట్లు వేసే రైతాంగం ఎలాంటి మెలకువలు పాటించాలో ఈనాటి మట్టిమనిషి కార్యక్రమంలో తెలుసుకుందాం.

Elephant Foot Yam Cultivation : వాణిజ్య సరళిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కంద ఎక్కువగా గోదావరి జిల్లాలలోను, కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికంగా సాగులోవుంది. ఈ పంటను విత్తేందుకు ఇదే సరైన అదును.

కందపంటలో ఎకరానికి వచ్చిన మొత్తం దిగుబడిలో దాదాపు 25 శాతం విత్తనానికి సరిపోతుంది. కాబట్టి రైతులు విత్తనం ఎంపిక దగ్గర నుంచి ప్రతి దశలోను శాస్ర్తీయతను జోడించినట్లయితే ఎకరాకు 30టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం వుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దుంపలను నాటగా.. ప్రస్తుతం నాట్లు వేసే రైతాంగం ఎలాంటి మెలకువలు పాటించాలో ఈనాటి మట్టిమనిషి కార్యక్రమంలో తెలుసుకుందాం.

ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి డిమాండ్ :
మన రాష్ట్రంలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో.. వాణిజ్య ప్రాముఖ్యత కలిగిన పంట కంద. భారతదేశం లో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాగుచేస్తుంటారు. కోస్తా జిల్లాలలో అధికంగా సాగులో వుంది. ఈ దుంపను కూరగాయగాను, పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు. దీనిలో ప్రధానంగా పిండిపదార్ధాలు, ఖనిజ లవణాలు, విటమిన్ ఎ, విటమిన్ బి ఎక్కువగా వుంటాయి.  నల్లరేగడి నేలల్లో మే, జూన్‌ మాసాల్లో దుంప నాటుకుంటే అధిక దిగుబడి వస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబర్ డిసెంబరు నెలల్లో కూడా నాటవచ్చు.

కంద సాగుకు నీటి వనరులు కలిగి ఉండి, నీరు బయటకుపోయే సౌకర్యం ఉన్న సారవంత నేలలు అనుకూలం.  వేసవిలో భూమిని 30 నుంచి 40 సెం.మీ లోతుగా దున్నాలి. మన ప్రాంతంలో ప్రధానంగా గజేంద్ర రకం ఎక్కువగా సాగులో వుంది. దీని పంటకాలం 7నుంచి 8నెలలు. లంక భూముల్లో దీని విస్తీర్ణం ఎక్కువగా ఉంది. అలాగే ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది. దీంతో రైతులు ఎక్కువగా కంద సాగువైపు మొగ్గుచూపుతున్నారు. విత్తనం ఎంపిక, సాగు యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చంటున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం   సీనియర్ శాస్త్రవేత్త డా. పి. సుధా జాకబ్.

నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలం :
కందలో అంతరకృషి చేయ్యటానికి అవకాశం ఉండదు. కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫా తడి ఇచ్చిన తరువాత కలుపు మందులను పిచికారి చేసి అరికట్టాలి. అలాగే సిఫార్సు చేసిన మేరకకు ఎరువులను సమయానుకూలంగా వేయాలి. కంద పూర్తిగా మొలకెత్తటానికి 40 రోజుల సమయం పడుతుంది. నీటి తడులు సరిగా లేనప్పుడు మొక్కల్లో సూక్ష్మపోషకాల లోపాలు కనిపిస్తాయి.  విత్తన దుంపలు నాటిన వెంటనే తడి పెట్టాల్సి ఉంటుంది.  మొలక వచ్చిన తరువాత ప్రతి 10 రోజులకు ఒకసారి నీటి తడులను అందించాలి. సూక్ష్మధాతు లోపాలు కనిపించినప్పుడు వెంటనే తగిన పోషకాలతో వీటిని సవరించాలి.

కందకు తెగుళ్ల బెడద ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు, కాండం కుళ్లు తెగులు, మోజాయిక్ తెగులు ఆశిస్తుంటాయి. వాటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలను చేపట్టాలి. ఈ విధంగా మేలైన యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఎకరా కంద నుండి 70 నుంచి 100 పుట్ల దిగుబడి సాధించవచ్చు. కొబ్బరి, అరటి తోటల్లో అంతర పంటగా కంద సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు అధికంగా వున్నా నష్టభయం లేని పంటగా కందసాగు రైతుకు మంచి ఫలితాలను అందిస్తోంది.

Read Also : Organic Farming : ప్రకృతి వ్యవసాయం చేస్తున్న టీచర్.. అంతర పంటల సాగుతో అధిక ఆదాయం

ట్రెండింగ్ వార్తలు