Fertilizers In Banana : అరటిలో ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన తప్పనిసరి!

అరటి చెట్టుకు రెండు వైపులా 10 సెం.మీ. లోతు గుంటలు తీసి ఎరువులను గుంటల్లో వేసి మట్టితో కప్పి తేలికపాటి నీటి తడులను అందించాలి. తేలికపాటి నీటి తడి అనగా ఎరువులు కరగడానికి అవసరమైనంత నీరు మాత్రమే అందిచాలి.

Banana farmers face problem of lack of fertilizers

Fertilizers In Banana : అరటి ఉష్ణ మండలపు పంట. సరాసరి 25-30 డిగ్రీల సెల్సియస్‌ ఈ పంటకు అనుకూలం. శీతాకాలంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువ కాకూడదు. సారవంతమైన, తగినంత నీటి వసతి కలిగి, నీరు ఇంకిపోయే గుణంతోపాటు తగినంత సేంద్రీయ పదార్ధాలు గల నేలలు మిక్కిలి అనుకూలం. సారవంతమైన ఒండ్రునేలలు శ్రేష్టం. అరటి సాగుకు సంబంధించి కర్పూర చక్కెర కేళి, తెల్ల చక్కెర కేళి, బొంత రకాలను సంవత్సరం పొడవునా నాటవచ్చు. అయితే ఏప్రిల్‌, ఆగష్టు నెలల మధ్య కాలంలో నాటటం మంచిది. పొట్టి పచ్చ అరటి, పెద్దపచ్చ అరటి రకాలను తొలకరి వర్షాలు పడిన తర్వాత జూన్‌ నెల నుండి సెప్టెంబరు 15 వరకు నాటుకోవచ్చు.

అరటి పంట వేయాలని నిర్ణయించుకున్న తరువాత వేసవిలో భూమిని 30-40 సెం.మీ. లోతుగా దున్నాలి. దీని వలన భూమి ద్వారా వ్యాపించే చీడపీడలను, కలుపును అరికట్టవచ్చు. తొలకరి వర్షాలకు గొర్రుతో 3-4 సార్లు మెత్తగా దున్నాలి. ఎంపిక చేసిన రకానికి అవసరమైన దూరంలో 45X45X45 సెం.మీ. పొడవు, వెడల్పు, లోతు కలిగిన గుంతలు తీసుకోవాలి.

అరటిలో ఎరువుల యాజమాన్యం ;

అరటికి ఎరువులు అందించే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అన్ని అరటి రకాలకు ఒక్కొక్క చెట్టుకు 50 గ్రా. భాస్వరాన్నిచ్చే ఎరువును వేయాలి. భాస్వరపు ఎరువును, అరటి మొక్క నాటిన కొద్ది కాలంవరకు మాత్రమే ఉపయోగించుకుంటుంది. భాస్వరపు ఎరువును, సూపర్‌ఫాస్ఫేట్‌ రూపంలో, పిలక నాటేటపుడు గుంట నుండి తవ్విన మట్టికి కలపటమే మంచిది.

సూపర్‌ఫాస్ఫేటు వాడినప్పుడు, అందులోని గంధకం మరియు కాల్షియం వంటి సూక్ష్మపోషకాలు కూడా పంటకు లభ్యమౌతాయి. పైపాటుగా భాస్వరపు ఎరువును వేయరాదు. వేసినా ఫలితం ఉండదు కనుక కాంప్లెక్స్‌ ఎరువులు వాడరాదు. బాగా చివికిన పశువుల ఎరువును సూపర్‌ ఫాస్ఫేటుతో పాటు ఒక్కొక్క గుంటకు 5.0 కిలోల వంతున కలపాలి. సారవంతమైన సాధారణ నేలలో అరటిచెట్టు ఒక్కటికి 200 గ్రా. నత్రజని, 200 గ్రా. పొటాష్‌ యిచ్చే ఎరువులు అవసరం. నత్రజని (యూరియా), పొటాష్‌ (మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌) ఎరువులను నాలుగు సమభాగాలుగా వేసుకోవాలి.

ఒక్కొక్క దఫాకు 110 గ్రా. యూరియా మరియు 80 గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌లను వేయాలి. కర్పూర చక్కెరకేళి, కొవ్వూరు బొంత రకాలకు పిలక నాటిన తర్వాత 45, 90 135 మరియు 180 రోజులకు వేసుకోవాలి. పెద్దపచ్చ అరటి, పొట్టి పచ్చఅరటి రకాలకు పిలకనాటిన తర్వాత 40, 80, 120 మరియు 160 రోజులకు వేయాలి. తెల్ల చక్కెరకేళి రకానికి 250 గ్రా. నత్రజని, 250 గ్రా. పొటాష్‌ ఎరువులు అవసరం. తెల్ల చక్కెర కేళి రకానికి నత్రజని , పొటాష్‌ ఎరువులను 5 సమభాగాలుగా విభజించి, పిలక నాటిన తర్వాత 35, 70, 105, 140 మరియు 175 రోజులకు అందించాలి.

కర్పూర చక్కెరకేళి, కొవ్వూరుబొంత, పెద్దపచ్చ అరటి, పొట్టిపచ్చ అరటి రకాలకు 300 గ్రా. నత్రజని, 300 గ్రా. పొటాష్‌ ఎరువులు వేయాలి. గరపనేలల్లో కర్పూర చక్కెరకేళి మరియు కొవ్వూరు బొంత రకాలకు నత్రజని, పొటాష్‌ ఎరువులను 6 సమ భాగాలుగా విభజించి పిలక నాటిన 30, 60, 90, 120, 150 మరియు 180 రోజులకు వేయాలి. పెద్దపచ్చ అరటి, పొట్టిపచ్చ అరటి రకాలకు నత్రజని, పొటాష్‌ ఎరువులను పిలకనాటిన తర్వాత 25, 50, 75, 100, 125 మరియు 150 రోజులకు అందించాలి.

అరటి చెట్టుకు రెండు వైపులా 10 సెం.మీ. లోతు గుంటలు తీసి ఎరువులను గుంటల్లో వేసి మట్టితో కప్పి తేలికపాటి నీటి తడులను అందించాలి. తేలికపాటి నీటి తడి అనగా ఎరువులు కరగడానికి అవసరమైనంత నీరు మాత్రమే అందిచాలి. దీని వల్ల కరిగిన ఎరువులు, వేరు మండలం ఉన్నంత వరకే పలుచగా వ్యాపించి, పైరుకు ఎక్కువగా పోషకాలు అందేలా చేస్తాయి.