leucaena
Subabul Cultivation : వంటచెరకుగా, నారగా, పశువుల మేతగా ఉపయోగించే బహువార్షిక మొక్క సుబాబుల్. కలప పనిముట్లకు మరియు కాగితపు గుజ్జు కోసం ఉపయోగిస్తారు. ఉష్ణమండలాల్లో బాగా పెరుగుతుంది. వర్షపాతం 600-1700 మీ.మీ. ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. అన్నిరకాల తటస్థ నేలల్లో పెరుగుతుంది. క్షార మరియు ఆమ్ల నేలల్లో పెరగదు. లోతైన, సారవంతమైన మరియు ఎక్కువ తేమ లభ్యమయ్యే నేలలు అనుకూలం. బంజరు భూముల్లోను, చెరువు గట్లపైన, పశువుల తాకిడి లేని కాలువ గట్లపైన, పొలాల గట్లపైన పెంచవచ్చు.
నారు పెంపకం, నాటే పద్దతి ;
విత్తన శుద్ధి తర్వాత నారుమళ్ళలో నేరుగా విత్తడానికి వరుసల మధ్య 20 సెంటీమీటర్ల వరుసలో 4 సెంటీమీటర్ల దూరంలో 1.5 సెంటీమీటర్ల లోతుగా విత్తనాలు విత్తుకోవచ్చు. లేదా 22 : 10 సెంటీమీటర్ల పాలిథీన్ సంచుల్లో పేడ, ఎరువులను కలిపిన మట్టిని నింపి ఒక సంచికి 2 విత్తనాలు చొప్పున విత్తుకోవాలి. ఈ విత్తనాలను మార్చి, ఏప్రిల్‍లో విత్తినట్లయితే జూలైకల్లా మొక్కలు నాటటానికి తయారవుతాయి. వేసవిలో 30 :30 : 45 ఘ.సెం.మీ. పరిమాణం గల గుంతలను త్రవ్వితే నేల గుల్లబారి మొక్క నాటటానికి అనువుగా ఉంటుంది. వర్షాకాల ప్రారంభంలోనే మట్టి నింపిన గుంతల్లోను, సంచుల్లోను మొక్కలను నాటాలి. మొక్కల మధ్య దూరం 2 : 2 మీటర్లు గాని, 2 : 3 మీటర్లు గాని ఉంచాలి. ఎకరాకు 666 నుండి 1000 మొక్కల వరకు నాటుకోవచ్చు.
సుబాబుల్ 6 సంవత్సరములలో 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వర్షాధార ప్రాంతాల్లో సాధారణంగా కలప దిగుబడి ఎకరాకు సంవత్సరానికి 4 నుంచి 8 ఘ.మీ. వస్తుంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 2 నుంచి 3 రెట్లు అధికంగా కలప దిగుబడి వస్తుంది. పశుగ్రాసం ఎకరాకు వర్షాధార ప్రాంతాల్లో 5 నుంచి 10 టన్నులు, నీటివసతి ఉన్న ప్రాంతాల్లో 32 నుంచి 36 టన్నులు వస్తుంది.
కలప గట్టిగా, నాణ్యంగా ఉంటుంది. భవన నిర్మాణానికి, ఫర్నీచర్ తయారీకి ఉపయోగపడుతుంది. కొమ్మలు వంటచెరుకుగా పనికివస్తాయి. ఆకులు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. మొక్కలను 8 మీటర్ల ఎడంగా రెండు ఉమ్మడి వరుసల్లో నాటి, వాటిని భూమి నుండి 30 సెంటీమీటర్ల ఎత్తుకు కొస్తే ఎకరాకు 0.8 టన్నుల వరకు ఎండుమేత, అర టన్ను వంట చెరుకు లభిస్తాయి.