VIP దర్శనంపై పిల్ కొట్టేసిన హైకోర్టు

వీఐపీ దర్శనంపై వేసిన పిల్(పబ్లిక్ ఇంటరస్ట్ లిటిగేషన్)ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కొట్టిపడేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వీఐపీ దర్శనాలు సాధారణ భక్తుల దర్శనాలకు ఆటంకం కలిగిస్తున్నాయంటూ పిల్ దాఖలు చేశారు. వాటిని కొట్టి పారేస్తూ L1, L2, L3ల నుంచి సాధారణ భక్తుల హక్కులకు భంగం కలగడం లేదని స్పష్టం చేసింది. 

ప్రకాశం జిల్లాకు చెందిన జాగర్లమూడి వెంకట సుబ్బారావు L1, L2, L3ల కింద దర్శనాన్ని కేటగరైజ్ చేస్తుంటే భక్తుల ప్రాథమిక హక్కులు ఉల్లంఘించినట్లు అవుతుందని కోర్టుకు కంప్లైంట్ చేశారు.  టీటీడీలో వీఐపీ దర్శనాలు ఆపేయాలని కోరారు. చీఫ్ జస్టిస్ సీ ప్రవీణ్ కుమార్, ఎమ్ సత్యనారాయణ మూర్తిలతో కూడిన రిజర్వ్ బెంచ్ తీర్పునిచ్చింది. 

ప్రత్యేకమైన సమయాల్లో ప్రతి రోజు 2గంటలపాటు ఉండే వీఐపీ దర్శనాలు హక్కులకు భంగం కలిగించినట్లు అవదని తేల్చి చెప్పింది. సామాన్య భక్తులకు దర్శనం ఇంకా సజావుగా జరిగే ఏర్పాట్లు చేయాలని టీటీడీని ఆదేశించింది. జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో ఉన్న వాళ్లు దర్శనానికి వెళ్లే సమయంలో ఎల్లో బుక్ అనుసరించాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.