Pawan Kalyan: ఏడు కొండల వాడితో పెట్టుకున్న వాడు మట్టిలో కలిసిపోతాడు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలకు వాస్తవాలు చెప్పకుంటే అది ఇంకా పెద్ద తప్పు అవుతుందనే వాస్తవాలు బయటపెడుతున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ హయాంలో పెద్దఎత్తున దేవాలయాలపై దాడులు జరిగితే ఏ చర్య లేదని పవన్ ధ్వజమెత్తారు.
Pawan Kalyan
- మేము కాదు.. మీరే దేవుడికి క్షమాపణలు చెప్పాలి
- కల్తీ అంశాన్ని వదిలే ప్రసక్తే లేదు
- 2022లోనే కల్తీ నెయ్యి గురించి తెలిసినా చర్యలు తీసుకోలేదు
Pawan Kalyan: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశం ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేసింది. ఈ విషయంలో కూటమి నాయకులు క్షమాపణ చెప్పాల్సిందేనని వైసీపీ నేతలు చేస్తున్న డిమాండ్ పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలపై ఎదురు దాడికి దిగారు. మేము కాదు క్షమాపణ చెప్పాల్సిందే మీరే అని తేల్చి చెప్పారు. భగవంతుడుపై పగపట్టి ఏడు కొండలను రెండు కొండలుగా చిత్రీకరించిన నేపథ్యం వైసీపీదీ అని పవన్ విరుచుకుపడ్డారు. భగవంతుడితో పెట్టుకున్న వాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప బతికి ఉన్న దాఖలాలు లేవని హెచ్చరించారు. ఇప్పటికైనా చేసిన మహా పాపానికి దేవుడిని క్షమాపణ కోరుకోవాలని వైసీపీ నేతలను డిమాండ్ చేశారు పవన్ కల్యాణ్. తప్పు చేశామని భగవంతుడికి మోకరిల్లే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు.
హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో కూటమి నాయకులు చాలా స్పష్టంగా ఉన్నామని చెప్పారు. లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం ముమ్మాటికీ తెలిసి చేసిన నేరం అని పవన్ ఆరోపించారు. 2022 లోనే కల్తీ నిర్ధారణ అయినా ఆయోధ్యకు కల్తీ లడ్డూలు పంపి మహా పాపానికి ఒడిగట్టారని విరుచుకుపడ్డారు. కల్తీ లడ్డూ వ్యవహారంలో కళ్ల ముందు ఎన్నో వాస్తవాలు కనిపిస్తుంటే మాట్లాడకపోవటం సబబు కాదన్నారు. అన్ని నివేదికలు ప్రసాదంలో వాడిన పదార్థాల్లో నెయ్యి లేదని నిర్ధారించాయన్నారు.
ఎన్డీడీబీ జంతు కొవ్వు అవశేషాలు నిర్ధారిస్తే, తమ వద్ద అలాంటి పరీక్ష చేసే సామర్థ్యం లేదని ఎన్డీఆర్ఐ చెప్పిందన్నారు. ప్రతీ మాట భక్తుల మనోభావాలు, సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నామన్నారు. దేవుడి విషయాన్ని రాజకీయం చేయకూడదనే నిష్ఠతో వ్యవహరిస్తూ వస్తున్నామన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుంటే అది ఇంకా పెద్ద తప్పు అవుతుందనే వాస్తవాలు బయటపెడుతున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ హయాంలో పెద్దఎత్తున దేవాలయాలపై దాడులు జరిగితే ఏ చర్య లేదని పవన్ ధ్వజమెత్తారు.
వైఎస్ వివేకాది మర్డర్ కాదు గుండెపోటు అంటారా?
”నెయ్యిలో కల్తీ జరిగిందని సాధారణ గృహిణి కూడా చెప్పగలదు. తప్పులు చేసి ఇవాళ బుకాయిస్తున్నారు. ఏమీ లేదని మాట్లాడుతున్నారు. వివేకానంద రెడ్డిని పబ్లిక్ గా మర్డర్ జరిగితే.. అది మర్డర్ కాదు గుండెపోటు అని చెబుతారు. అమ్మవారి వెండి విగ్రహాలు పోతే.. పోతే పోనీ అంటారు. దేవుడి రథం కాలిపోతే పిచ్చోడు చేశాడని అంటారు. కల్తీ జరిగితే జరగలేదు అంటారు. సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. దీన్ని బట్టి మనమంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. దీని మీద వీళ్లకి గౌరవం లేదు.
ఏడు కొండల వాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచనా విధానం నుంచి పుట్టిన వాళ్లు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరు. ఇది చాలా స్పష్టంగా తెలుస్తోంది. కల్తీ జరిగింది అంటే వేరే మతాలను అనడం కానీ, వేరే విశ్వాసాలను కించపరటం కానీ చేయలేదు. ఒక తప్పు జరిగింది. కల్తీ జరిగింది. దాని గురించి చాలా క్లియర్ గా ఉన్నాం. ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదు. కల్తీ జరిగిందని 2022లోనే తెలిసింది. ఆ రిపోర్ట్ ను తొక్కేశారు. దాన్ని బయటకు తీసుకురాలేదు. అంటే మీకు తెలిసే చేశారు. ఇవన్నీ తెలిసి కూడా అయోధ్యకి కల్తీ లడ్డూలు పంపారు.
కల్తీ అంశాన్ని వదిలేది లేదు..
ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బ. భగవంతుడి మీద పగ పెట్టుకున్న వాడు ఎవడైనా, ఏడు కొండల మీద పగ పెట్టుకున్న వాడు ఎవడైనా.. మట్టిలో కలిసిపోతారు. చేసిన తప్పులకు క్షమాపణ వేడుకోండి. మేము కాదు మీరు దేవుడికి క్షమాపణలు చెప్పాలి. ఏడు కొండల వాడికి మీరు క్షమాపణలు చెప్పాలి. కల్తీ అంశాన్ని వదిలేది లేదు” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.
