AP Lemon Price : ఆ రైతుల పంట పండింది కదా.. బస్తా ఏకంగా రూ.10 వేలు
AP Lemon Price : రాష్ట్రంలో నిమ్మ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఒక్క బస్తా రూ.10 వేలు అమ్ముడవుతుంది.
- Dharani Pilli
- Published On : April 6, 2026 / 08:02 AM IST
Andhra Pradesh lemon prices hit record high rs 10000 per one bag
- నిమ్మ రైతుల పంట పండింది
- కేజీ రూ.100-120
- ఒక్క బస్తా నిమ్మ రూ.10 వేలు
AP Lemon Price : సాధారణంగా రైతులు పెద్దగా లాభాలు ఆశించరు. వేసిన పంటకు పెట్టిన పెట్టుబడి పోను.. కొంత మొత్తం మిగిలినా చాలు అనుకుంటారు. లేదంటే వేసిన పంట వల్ల అప్పుల పాలు కాకపోతే అదే పదివేలని భావిస్తారు. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వాల నిర్ణయాల వల్ల అన్నదాతలకు నష్టాలు వచ్చే సందర్భాలే ఎక్కువ. ఎప్పుడో ఒకసారి వారికి కాలం కలిసి వచ్చి భారీ ఎత్తున లాభాలు చవిచూస్తారు. గతంలో వేసవి కాలంలో టమాటా రైతులు భారీగా లాభపడిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక వర్గం రైతులకు కాలం కలిసి వచ్చింది. కేజీ రూ. 120 కాగా, బస్తా ఏకంగా రూ. 10 వేలు పలుకుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఈ సంవత్సరం నిమ్మ రైతుల పంట పండింది. గతంతో పోలిస్తే ఈసారి నిమ్మ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. వేసవి కావడంతో మార్కెట్‌లో నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ ఉంది. హైదరాబాద్ వంటి నగరాల్లో ఒక్క నిమ్మకాయ ధర రూ. 10 పలుకుతోందంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్‌లో నిమ్మకాయలు కేజీ రూ. 100 నుంచి రూ. 120 మధ్యలో ఉన్నాయి. అలాగే బస్తా నిమ్మకాయల ధర రూ. 10 వేలు పలుకుతోంది.
వాస్తవానికి మార్చి రెండో వారం వరకు నిమ్మకాయలకు సరైన ధరలు లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఇటీవల ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాల మార్కెట్‌లో నిమ్మకాయలకు డిమాండ్ భారీగా పెరగడంతో ప్రస్తుతం ఒక్క నిమ్మకాయ ధర రూ. 5 నుంచి రూ. 6 వరకు పలుకుతోంది. ఇది ఇలాగే కొనసాగితే నెలాఖరులో నిమ్మ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో తమ కష్టానికి తగిన ఫలితం దక్కిందని నిమ్మ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
