Weather Update : తగ్గినట్లే తగ్గి మళ్లీ వానలు.. తెలుగు రాష్ట్రాలకు మరో 3 రోజులు వాన గండం.. ప్రజలు జాగ్రత్త..!
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, ఈదురుగాలులపై వాతావరణ శాఖ తాజా హెచ్చరికలేంటో ఇప్పుడు చూద్దాం..
Andhra Pradesh, Telangana Weather Update
- తెలుగు రాష్ట్రాలకు మరో మూడు రోజులు భారీ వర్ష సూచన
- ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తుఫాన్ ప్రభావం ఇంకా పోలేదు..
- వర్షాలకు ఇప్పట్లో బ్రేక్ లేనట్టేనా? తెలుగు రాష్ట్రాలకు వెదర్ అలర్ట్
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో పాటు రైతులకు భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ లేటెస్ట్ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది..
భారత వాతావరణ శాఖ ప్రకారం.. తూర్పు తెలంగాణ, రాష్ట్రానికి ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర ప్రాంతంలో కొనసాగిన (Weather Updates) అల్పపీడనం నవంబర్ 5 ఉదయం 8.30 గంటల సమయానికి బలహీనపడింది.
అయితే, దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మాత్రం 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు :
కోస్తాంధ్ర, యానాంలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
శుక్ర, శనివారాల్లోనూ కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు పడే సూచనలున్నాయి. రాయలసీమలో గురువారం (నవంబర్ 5) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా..
తెలంగాణలోనూ వానలే.. :
తెలంగాణలో కూడా మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి :
ఇప్పటికే భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు మరోసారి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కింద ఉండకూడదు. వర్షాలపై వాతావరణ శాఖ ఇచ్చే తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది..
