AP Transport Department: ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు.. 6 జోన్లు, 2 మల్టీ జోన్లు ఖరారు.. స్థానికులకు 95% రిజర్వేషన్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Transport Department) రవాణా శాఖలోని ఉద్యోగ నిబంధనలకు సంబంధించి కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra pradesh transport department new service rules local reservation zones
AP Transport Department: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖలోని ఉద్యోగ నిబంధనలకు సంబంధించి కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ రూల్స్-1993లో ప్రధాన సవరణలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్టీఓ (RTO), మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) నుంచి ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుళ్ల వరకు అన్ని కేడర్లను స్థానిక కేడర్లుగా మారుస్తూ నిర్దిష్టమైన నియామక యూనిట్లను ప్రభుత్వం ఖరారు చేసింది. రవాణా పరిపాలనలో పారదర్శకత, స్థానిక అభ్యర్థులకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
జోన్ల విభజన వివరాలు.. ఏ పోస్టుకు ఎన్ని జోన్లు?
నూతన విధానం ప్రకారం (AP Transport Department)ఆర్టీఓ, ఎంవీఐ పోస్టులకు రెండు మల్టీ జోన్లను కేటాయించగా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎంవీఐ పోస్టులను ఆరు జోన్ల పరిధిలోకి తీసుకొచ్చారు.
* జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి.
*జోన్-2: అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ.
*జోన్-3: పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా.
*జోన్-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు.
*జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప.
*జోన్-6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలు ఉన్నాయి.
స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్.. అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్:
ఈ సవరణలతో రవాణా శాఖలో చేపటే ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు ఏకంగా 95 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. నియామకాలు, పదోన్నతులు, బదిలీలకు కొత్త యూనిట్లు ప్రామాణికం కానుండగా.. ప్రమోషన్ పొందేందుకు కనీసం రెండేళ్ల సర్వీసును తప్పనిసరి చేశారు. జూలై 15 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వచ్చినట్లు జీవోలో పేర్కొన్నారు. ఈ నిబంధనలు స్థానిక నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.
