Annadata Sukhibhava Funds: ఏపీ రైతులకు సీఎం చంద్రబాబు దసరా కానుక.. అకౌంట్లలోకి రూ.6,000 జమ.. ఇవి పూర్తి చేస్తేనే డబ్బులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava Funds)' పథకం రెండో విడత ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రక్రియ వేగవంతం చేసింది.
AP government set to release Annadata Sukhibhava and PM Kisan funds As Dussehra gift
Annadata Sukhibhava Funds: ఆంధ్రప్రదేశ్లోని రైతాంగానికి కూటమి ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించిన ‘అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava Funds)’ పథకం రెండో విడత ఆర్థిక సాయాన్ని దసరా పండుగ కానుకగా అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రక్రియ వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వం అందించే ‘పీఎం కిసాన్’ సాయంతో కలిపి ఈ విడతలో ప్రతి రైతు కుటుంబానికి ఏకంగా రూ.6,000 నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ కానున్నాయి.
ఒకేసారి రూ.6,000 జమ.. కేంద్ర, రాష్ట్ర నిధుల కలయిక:
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.2,000 విడుదల చేయనుండగా, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.4,000 కలిపి ఒకే విడతలో ఇవ్వనుంది. రెండు పథకాల ద్వారా ఏటా ప్రతి రైతుకు మొత్తం రూ.20,000 (పీఎం కిసాన్ రూ.6,000 + రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000) ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే తొలి విడతగా జూన్ 20న సీఎం చంద్రబాబు నాయుడు రూ.7,000 విడుదల చేయగా, ఇప్పుడు రెండో విడతగా రూ.6,000 జమ కానుంది.
లబ్ధిదారులకు కీలక నిబంధనలు.. ఈ ప్రక్రియలు తప్పనిసరి:
ఈ ఆర్థిక సాయం రైతుల ఖాతాల్లో జమ కావడానికి ప్రభుత్వం కొన్ని ప్రాథమిక అర్హతలను ఖరారు చేసింది. లబ్ధిదారులు తప్పనిసరిగా తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేయడంతో పాటు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు భూమి వివరాల ధృవీకరణ (ల్యాండ్ వెరిఫికేషన్) పూర్తయి పీఎం కిసాన్ పోర్టల్లో నమోదైన రైతులకు మాత్రమే ఈ నిధులు జమ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.
