CPS to OPS Conversion: ఏపీ CPS ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..OPSలోకి మారేందుకు ఛాన్స్.. కీలక మార్గదర్శకాలు జారీ!
ప్రస్తుతం సీపీఎస్‌లో(CPS to OPS Conversion) ఉన్న అర్హులైన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఓపీఎస్‌లోకి మారేందుకు ఒకేసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
Ap govt issues guidelines for cps to ops conversion for eligible employees
CPS to OPS Conversion: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత కీలకమైన వెసులుబాటు కల్పిస్తూ అధికారిక మార్గదర్శకాలు జారీ చేసింది. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందే నియామక నోటిఫికేషన్ జారీ అయి, ఆ తర్వాత ఉద్యోగంలో చేరి ప్రస్తుతం సిపిఎస్‌లో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్ (CPS to OPS Conversion)లోకి మారేందుకు చివరి అవకాశంగా ఒకేసారి ‘ఆప్షన్’ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారితో పాటు పదవీ విరమణ చేసినవారు, మరణించిన ఉద్యోగుల కుటుంబ పెన్షన్ లబ్ధిదారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించింది.
నిధి పోర్టల్ ద్వారా దరఖాస్తులు.. నాలుగు కీలక పత్రాల ధ్రువీకరణ తప్పనిసరి:
అర్హులైన ఉద్యోగులు డిసెంబర్ 31, 2026 లోగా ‘NIDHI’ పోర్టల్‌లోని ‘CPS-OPS Conversion’ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు నియామక నోటిఫికేషన్, సెలక్షన్ లిస్ట్, అపాయింట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ ఆర్డర్ అనే నాలుగు ప్రాథమిక పత్రాలను అధికారులు ధ్రువీకరించి ఆన్లైన్లో సమర్పించాలి. ఆ తర్వాత డిడిఓ (DDO), కాంపిటెంట్ అథారిటీ పరిశీలించి తుది ఆమోదం తెలిపిన తర్వాతే ఒపిఎస్‌లోకి మార్పు పూర్తవుతుంది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నోటిఫికేషన్ వచ్చిన వారికి ఈ అవకాశం వర్తించదు.
ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ వర్తింపు.. ఒకసారి మారితే తిరిగి సిపిఎస్‌కు వెళ్లేందుకు నో ఛాన్స్:
ఒపిఎస్‌లోకి మారిన ఉద్యోగులకు ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 వర్తిస్తాయని, వారికి కొత్తగా జీపీఎఫ్ (GPF) ఖాతా కేటాయిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. సిపిఎస్‌లో ఇప్పటివరకు జమ చేసిన ఉద్యోగి వాటాను జీపీఎఫ్ ఖాతాకు బదిలీ చేస్తారని, ప్రభుత్వ వాటాను ప్రభుత్వ ఖాతాకే మళ్లిస్తారని తెలిపింది. అయితే ఈ మొత్తాన్ని నగదు రూపంలో నేరుగా ఉద్యోగికి ఇవ్వరు. ఒపిఎస్‌లోకి మారిన ఉద్యోగులు మరలా ఎట్టి పరిస్థితుల్లోనూ సిపిఎస్ విధానంలోకి తిరిగి వెళ్లడానికి అవకాశం ఉండదు కాబట్టి నిబంధనలు క్షుణ్ణంగా పరిశీలించుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
