AP Cyclone Alert: ఏపీకి పొంచి ఉన్న మరో భారీ తుఫాన్ ముప్పు.. మంగళవారం తుఫానుగా మారనున్న వాయుగుండం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం నాటికి తీవ్ర తుఫానుగా(AP Cyclone Alert) మారి అవకాశం ఉండటంతో ఏపీలోని నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Ap Meteorological Department has issued a yellow alert, as a low-pressure area in the Bay of Bengal
AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 960 కి.మీ, చెన్నైకి 800 కి.మీ, శ్రీలంకలోని ట్రింకోమలీకి 620 కి.మీ, అండమాన్‌లోని శ్రీ విజయపురానికి 680 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1070 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు.
మంగళవారం నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం:
ఈ వాయుగుండం మరింత బలపడి సోమవారం నాటికి దక్షిణ, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత మంగళవారానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా రూపాంతరం చెంది, తదుపరి రెండు రోజుల్లో వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం వరకు కోస్తా తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఆ తర్వాత గాలుల(AP Cyclone Alert) తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు.
గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్:
తుఫాన్ ప్రభావం వల్ల గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని, రైతులు, ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
