Rammohan Naidu : మోదీని కలిసి రామ్మోహన్‌ నాయుడు కుటుంబం.. ‘మీ కుమారుడిని చూసి గర్వపడండి’

Rammohan Naidu : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

AP MP Rammohan naidu and his family meets narendra modi photos viral

Rammohan Naidu : కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు శనివారం తన తల్లి, భార్య, పిల్లలతో వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇక్కడి సేవాతీర్థ్‌లో రామ్మోహన్ నాయుడి కుటుంబం ప్రధానిని కలిసింది. సుమారు 20 నిమిషాలపాటు వీరి భేటీ సాగింది. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘మీరు పిలుపునిచ్చిన ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ (తల్లి పేరున ఒక చెట్టు) నినాదం స్ఫూర్తితో మా అమ్మను.. అలానే ఒక మొక్కను కూడా తెచ్చాను’ అని తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లి విజయకుమారిని ప్రధానికి పరిచయం చేశారు. ఆమె చేతుల మీదుగా మోదీకి మొక్కను అందించారు.

Rammohan naidu

రామ్మోహన్ నాయుడి తల్లి విజయకుమారితో మోదీ మాట్లాడుతూ.. ‘చాలా మంది నాయకుల సంతానం సరిగా పని చేయలేకపోతున్నారు. కానీ మీరు మాత్రం మీ కుమారుడిని చూసి గర్వపడొచ్చు. చాలా చిన్న వయసులో మంత్రి పదవి వచ్చినా.. కష్టపడి పని చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు’ అని తెలిపారు.

ఈ క్రమంలో మోదీతో దిగిన ఫోటోలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఈ రోజు తన ఫ్యామిలీకి జీవితాంతం గుర్తిండిపోతుంది అన్నారు. తన కుటుంబ సభ్యులతో మోదీ గడిపిన ఈ రోజు తమ కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే ఓ భావోద్వేగ క్షణమని పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ అసాధారణ వ్యక్తిత్వం, ఆప్యాయత.. మా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ప్రజల హృదయాల్లో ఎందుకు ఇంతటి ఆదరణ పొందారో ఈరోజు నాకు మరింత స్పష్టంగా తెలిసింది. ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరిట ఒక మొక్క)’ అనే గొప్ప ఆలోచనకు ప్రేరణగా మా అమ్మ ప్రధానికి మొక్కను బహుకరించడం ఎంతో గర్వకారణమైన క్షణంగా నిలిచిపోతుంది. ఆయన మాపై చూపిన ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులకు మేం కృతజ్ఞులం’’ అని రామ్మోహన్‌ నాయుడు ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు పెట్టారు.