AP Municipal Election Results 2026: ఏపీ మున్సిపల్ లెక్కింపులో ఆసక్తికర ఘటనలు.. సొంత వార్డుల్లో తెదేపా, వైకాపాకు భంగపాటు.. ఒకే ఒక్క ఓటుతో!
ఏపీ మున్సిపల్ ఎన్నికల (AP Municipal Election Results 2026)లెక్కింపులో చైర్మన్ అభ్యర్థులు సొంత వార్డుల్లో ఓడిపోవడం, ఒక్క ఓటు తేడాతో రీకౌంటింగ్ రచ్చ వంటి ఆసక్తికర ఘట్టాలు చోటుచేసుకున్నాయి.
Ap municipal elections counting interesting results tdp ysrcp atmakur dharmavaram
AP Municipal Election Results 2026: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పలు ఆసక్తికర ఘట్టాలు, తీవ్ర ఉత్కంఠ రేపిన పరిణామాలు చోటుచేసుకున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. ఇక్కడ టీడీపీ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు సొంత వార్డు (6వ వార్డు)లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించగా, అందుకు భిన్నంగా వైసీపీ చైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు సొంత వార్డు (10వ వార్డు)లో టీడీపీ అభ్యర్థి జయకేతనం ఎగురవేశారు. ప్రధాన పార్టీల చైర్మన్ అభ్యర్థులిద్దరి సొంత వార్డుల్లో(AP Municipal Election Results 2026) ప్రత్యర్థి పార్టీలు గెలవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నెల్లూరులో మేయర్ సొంత డివిజన్లో వైసీపీ ఓటమి.. ఆత్మకూరులో జనసేన రెబెల్స్ హవా:
మరోవైపు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కూటమికి రెబెల్స్ షాక్ ఇచ్చారు. జనసేన టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన గడ్డం సంధ్య (12వ వార్డు), కొలగాని శిరీష (11వ వార్డు) ఘనవిజయం సాధించారు. ఇక నెల్లూరు కార్పొరేషన్లో వైసీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి సొంత డివిజన్ అయిన 5వ డివిజన్లో వైసీపీ అభ్యర్థి జాషువాపై 398 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి అబ్రహం గెలుపొందారు.
ధర్మవరంలో ఒక్క ఓటుతో గెలుపు.. రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసిన భాజపా అభ్యర్థి:
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఒకటో వార్డులో అత్యంత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడ పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ కేవలం ఒక్క ఓటు స్వల్ప తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. అయితే ఈ ఫలితంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భాజపా అభ్యర్థి సాకే లక్ష్మీదేవి రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయడంతో అధికారులు మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టారు.
