AP Municipal Act: ఏపీ స్థానిక సంస్థల్లో బిగ్ చేంజ్.. గవర్నర్ నుంచి ఆమోదముద్ర.. కొత్త చట్టాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పాలన, పంచాయతీరాజ్ వ్యవస్థలకు(AP Municipal Act) సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
Ap municipal laws amendment governor approves deputy mayor post reduction
- ఏపీ స్థానిక చట్టాల సవరణ
- డిప్యూటీ మేయర్ పదవుల కుదింపు
- కొత్తగా 28 జిల్లా పరిషత్‌లు
AP Municipal Act: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పాలన, పంచాయతీరాజ్ వ్యవస్థలకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఏపీ మున్సిపల్ లా సవరణ చట్టంతో పాటు పంచాయతీరాజ్ సవరణలకు రాష్ట్ర గవర్నర్ అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ ఆమోదంతో రాష్ట్రంలోని స్థానిక సంస్థల నిర్మాణంలోనూ, పాలనా వ్యవహారాల్లోనూ పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
పదవుల సంఖ్య కుదింపు – గెజిట్ విడుదల:
సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లలో(AP Municipal Act) డిప్యూటీ మేయర్ పదవుల సంఖ్యను రెండింటి నుంచి ఒకటికి తగ్గించారు. అదే విధంగా మున్సిపాలిటీలలో ఉన్న వైస్ చైర్మన్ పదవులను కూడా రెండింటి నుంచి ఒకటికి కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ఆమోదం పొందిన ఈ సవరణలను త్వరలోనే అధికారిక గెజిట్‌లో ప్రచురిస్తూ న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. గెజిట్ ప్రచురణతో ఈ మార్పులకు పూర్తి చట్టబద్ధత లభించనుంది.
రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్‌ల ఏర్పాటు:
మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌ల స్థానంలో మొత్తం 28 జెడ్పీలను ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేశారు. ఈ సవరణ చట్టానికి కూడా గవర్నర్ ఆమోదం లభించడంతో రాష్ట్రంలో జెడ్పీల సంఖ్య పెరగనుంది. స్థానిక సంస్థల పదవుల కుదింపు, జెడ్పీల పెంపుతో ఏపీ పాలనా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.
