Vangaveeti Radha : విజయవాడ మేయర్గా వంగవీటి రాధా ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే? వైసీపీకి ఘోర పరాభవం
Vangaveeti Radha : విజయవాడ మేయర్ పీఠాన్ని కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జనసేన నేత వంగవీటి రాధా చేజిక్కించుకున్నారు. భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Vangaveeti Radha
Vangaveeti Radha : ఏపీలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగ్గా.. 12చోట్ల కూటమి అభ్యర్థులు మేయర్లుగా విజయం సాధించారు. అనంతపురం కార్పొరేషన్ లో మాత్రం వైసీపీ జెండా ఎగిరింది.
విజయవాడ మేయర్ పీఠాన్ని కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన జనసేన నేత వంగవీటి రాధా చేజిక్కించుకున్నారు. పుట్టినరోజే రాధా మేయర్ స్థానాన్ని దక్కించుకోవటంతో స్థానిక జనసేన పార్టీ శ్రేణులు సంబురాలను హోరెత్తించారు.
వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన భాగలక్ష్మీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. మరోవైపు.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభావం ఏమాత్రం కనిపించలేదు.
వంగవీటి రాధాకు మొత్తం 2,65,888 ఓట్లు రాగా.. 1,30,872 మెజార్టీ లభించింది. వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి ఏబీవీకి 12,642 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
కూటమి అభ్యర్థి వంగవీటి రాధా తన పార్టీ శ్రేణులు, అనుచరులతో కలసి తన కార్యాలయంలోనే ఫలితాలను వీక్షించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఆ తరువాత అనుచరులతో కలసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాధా విజయంతో జనసేన పార్టీ శ్రేణులు పెద్దెత్తున సంబురాలు చేసుకున్నారు.
మరోవైపు.. లయోలా కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లపై ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే, భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతంలో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో కౌంటింగ్ సెంటర్ వద్ద ఇలాంటి పరిస్థితి ఏమిటంటూ ఏర్పాట్లపై ఏబీవీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
