Central Government : రైతులకు, చిరు వ్యాపారులకు భారీ శుభవార్త.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇక ఆ ఇబ్బందులుండవ్..
Central Government : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని రైతులు, చిన్న వ్యాపారులకు శుభవార్త చెప్పింది.
Central Cabinet Approves Rs 62370 Crore Rabi Fertiliser Subsidy Mudra Fund
Central Government : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని రైతులు, చిన్న వ్యాపారులకు శుభవార్త చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఇందులో ప్రధానంగా దేశంలోని రైతులకు, చిరు వ్యాపారులకు ఊరట కలిగించేలా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
Also Read : AP Government : ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి కూటమి సర్కార్ శుభవార్త.. మూడు నెలల పాటూ పంపిణీ
పశ్చిమాసియా సంక్షోభంలో అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా రైతులపై అదనపు భారం పడకుండా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రబీ పంటల సాగు కోసం ఎరువుల సబ్సిడీ రూపంలో ఏకంగా రూ.62,370 కోట్లు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 రబీ సీజన్ తో పోల్చితే ఇది ఏకంగా 64శాతం అధికం. 2025-26 రబీలో ఎరువుల రాయితీ కోసం రూ. 37,952 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు అదనంగా మరో రూ. 24,418 కోట్లు కేటాయించారు.
రబీ సీజన్‌కు ఎరువులపై సబ్సిడీ 2027 మార్చి 31వరకు అమల్లో ఉంటుంది. దీనికింద కిలో నైట్రోజన్‌కు రూ.94.21, పాస్ఫరస్‌కు రూ.66.11, పొటాషియంకు రూ.2.38, సల్ఫర్ రూ.10.42 చొప్పున సబ్సిడీ అందజేస్తారు. 50 కిలోల డీఏపీ బస్తాను రూ.1,350కే అందించనున్నారు. రైతులకు తక్కువ ధరలకు ఎరువులు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా అక్టోబర్ నుంచి మార్చి వరకు రబీ పంటల సాగు జరుగుతుంది. ఈ సమయంలో రైతులు గోధుమలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర పంటలను సాగు చేస్తారు. వీటి సాగుకు అవసరమైన డీఏపీ, ఎన్పీకే వంటి ఎరువులను రైతులకు అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రభుత్వం ఈ సబ్సిడీని ప్రకటించింది.
మరోవైపు కేంద్ర కేబినెట్ మొత్తం రూ. 77వేల కోట్ల విలువైన పథకాలకు సమ్మతి తెలిపింది. ఇందులో చిన్న వ్యాపారులకు రుణాలు సులభంగా అందేలా ప్రధానమంత్రి ముద్ర యోజన కింద రూ.5,000 కోట్ల రుణ హామీ నిధికి కూడా ఆమోదం తెలిపింది. అంతేకాకుండా దేశ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ఢిల్లీలో భారీ మ్యూజియం ఏర్పాటుకు రూ.3,230 కోట్లు కేటాయించింది.
ఢిల్లీలోని చారిత్రక నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాలను మ్యూజియంగా మార్చనున్నారు. సుమారు 1.79 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మ్యూజియాన్ని నిర్మించనున్నారు. రోజుకు దాదాపు 30 వేల మంది సందర్శకులు వచ్చేలా దీనిని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2027 చివరి నాటికి తొలి గ్యాలరీని సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మ్యూజియం అభివృద్ధి పనులను 2027 నుంచి 2031 వరకు దశలవారీగా చేపట్టనున్నారు
