Cyclone Threat : ఉత్తరాంధ్రకు మళ్లీ తుపాను టెన్షన్.. 18, 19 తేదీల్లో దంచికొట్టనున్న వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్!
Cyclone Threat : బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా బలపడే అవకాశం ఉంది. నవంబర్ 18, 19 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఏయే జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో తెలుసుకుందాం..
Cyclone Threat to North Andhra
- ఉత్తరాంధ్రకు మరోసారి తుపాను ముప్పు.. 2 రోజులు భారీ వర్షాలు
- బంగాళాఖాతంలో బలపడుతున్న తుపాను.. అలర్ట్ జారీ
- 18, 19 తేదీల్లో వర్షాల బీభత్సం.. తీర ప్రాంత ప్రజలకు బిగ్ అలర్ట్..
Cyclone Threat : బంగాళాఖాతంలో మరోసారి వాతావరణం మారుతోంది. ఇప్పటికే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ఉత్తరాంధ్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుపానుగా మారే అవకాశం ఉంది.
దాంతో తీర ప్రాంత జిల్లాల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఈ నెల 18, 19 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
18 నాటికి తీవ్ర తుపాను :
విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. ఈ నెల 16 నాటికి తుపానుగా మారి 18వ తేదీ ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని అంచనా..
వర్షాల విషయానికి వస్తే.. :
18వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 19వ తేదీన పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
గరిష్ఠంగా 60కి.మీ వేగంతో ఈదురుగాలులు :
మరోవైపు తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత కూడా భారీగా పెరగనుంది. ఈ నెల 16 నుంచి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అప్పుడప్పుడు గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది..
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు :
మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వారు ఆదివారం సాయంత్రంలోగా తీరానికి చేరుకోవాలని, 16వ తేదీ నుంచి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచనలు చేశారు..
