Varupula Subbarao: వైసీపీకి మరో బిగ్ షాక్.. జనసేనలో చేరిన ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే సుబ్బారావు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నాయకుడు, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు(Varupula Subbarao) వైసీపీకి రాజీనామా చేశారు.
Ex mla varupula subbarao resigns ysrcp and joins in janasena party pawan kalyan
Varupula Subbarao: ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు(Varupula Subbarao) వైసీపీకి రాజీనామా చేశారు. కాకినాడ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా ఆయనకు జనసేన కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. సుబ్బారావుతో పాటు పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలకు చెందిన పలువురు వైసీపీ మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నేతలు కూడా జనసేన పార్టీలో చేరడం కాకినాడ జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జగన్ వైఖరిపై విమర్శలు.. సీనియారిటీకి గౌరవం లేదన్న సుబ్బారావు:
వైసీపీ విధానాలు నచ్చకపోవడం, పార్టీలో సీనియర్ నాయకులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్లే తాను రాజీనామా చేసినట్లు వరుపుల సుబ్బారావు స్పష్టం చేశారు. వైఎస్ జగన్ గతంలో తన వయసును సాకుగా చూపి అవమానించారని, సీనియారిటీకి ఏమాత్రం గౌరవం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పాలన నచ్చడంతోనే ఎలాంటి పదవులు లేదా కమిట్మెంట్లు ఆశించకుండా జనసేనలో చేరినట్లు తెలిపారు. కాకినాడ జిల్లాలో వరుసగా సీనియర్ నేతలు వైసీపీని వీడుతుండటంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది.
