Andhra Pradesh : ఏపీలో దారుణ ఘటన.. టెన్త్ క్లాస్ బాలికను రంపంతో కోసిన ఉన్మాది
Andhra Pradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు హైస్కూల్లో సైకో వీరంగం సృష్టించాడు.
- Harish Thanniru
- Updated on- October 31, 2026 / 12:49 PM IST
Andhra Pradesh
Andhra Pradesh : ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని రాప్తాడు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. రంపంతో పదో తరగతి చదువుతున్న బాలికపై దాడి చేశాడు. క్లాస్‌రూమ్‌లోనే ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు.
Also Read : YS Sharmila : యలహంక ప్యాలెస్ వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్..
బైక్ పై వచ్చిన ఉన్మాది నేరుగా పదవ తరగతి క్లాస్ రూమ్ లోకి వెళ్లాడు. ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణ రహితంగా బాలికపై దాడి చేశాడు. దీంతో విద్యార్థిని కుడిచేయి తెగిపోగా, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన మరో బాలికపైనా ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. ఉదయం 10.30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో క్లాస్ రూమ్ లో టీచర్ కూడా ఉన్నారు. అందరూ చూస్తుండగానే బాలికపై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. బాలికది అయ్యవారిపల్లెగా తెలుస్తోంది. మరోవైపు.. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. రంపంతో స్కూళ్లోకి, క్లాస్ రూమ్‌లోకి వ్యక్తి వస్తుంటే స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుందని ప్రశ్నించారు. టీచర్లు, సెక్యూరిటీ ఏం చేస్తున్నారు..? అంటూ నిలదీశారు. రోజు ఆటోలో స్కూల్‌కు వెళ్తుందని బాలిక మేనత్త తెలిపారు. ఎవరూ వేధిస్తున్నట్లు తమ పాప చెప్పలేదన్నారు. నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల తరగతి గదిలో రంపంతో అత్యంత దారుణంగా దాడి చేయడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స గురించి అధికారులతో మాట్లాడారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులు అధికారులను సీఎం ఆదేశించారు.
