Kurnool YSRCP: వైసీపీలో వార్.. ఆ టికెట్ కోసమేనా?

Kurnool YSRCP Leaders : కర్నూలులో అధికార పార్టీ, ప్రతిపక్షం పోరు కాస్త..వైసీపీ వర్సెస్‌ వైసీపీ అన్నట్టు మారిపోయింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, వైసీపీ కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ మధ్య సోషల్ మీడియా వార్ ఒక రేంజ్‌లో నడుస్తోంది.

  • Published on- June 6, 2026 / 03:28 PM IST

Kurnool YSRCP Leaders Phone Call Leak Clash on Social Media

Kurnool YSRCP: కర్నూలులో అధికార పార్టీ, ప్రతిపక్షం పోరు కాస్త..వైసీపీ వర్సెస్‌ వైసీపీ అన్నట్టు మారిపోయింది. టీడీపీలోని ఒక వర్గం పరోక్షంగా ప్రతిపక్ష నేతల మధ్య మంట పెట్టిందనే ప్రచారం జరుగుతున్న వేళ..కర్నూలు వైసీపీలో అంతర్గత పోరు వీధికెక్కుతోంది. ఏకంగా సోషల్ మీడియా వేదికగా నాయకులు దుమ్మెత్తి పోసుకోవడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, వైసీపీ కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ మధ్య సోషల్ మీడియా వార్ ఒక రేంజ్‌లో నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ కర్నూలు సీటు మైనారిటీకి వెళ్తుందని ఎస్వీ మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని.. టీడీపీ కన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ వర్గం తనపై కక్ష కట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు అహ్మద్ ఖాన్.

వారం పది రోజుల క్రితం కర్నూలు వేదికగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎస్వీ మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మధ్య మాటలు మంటలు చెలరేగాయి. అవి అలా చల్లారాయో లేదో ఇప్పుడు వైసీపీలో అంతర్గత పోరు కాక రేపుతోంది. పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడితో, ఎస్వీ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫోన్‌లో మాట్లాడిన మాటలు ఇప్పుడు బయటికి వచ్చాయి. వాయిస్‌ రికార్డ్ చేసిన ఐటీడీపీ ప్రతినిధి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతకు ముందు కర్నూలులో ఎస్వీ మోహన్ రెడ్డి, జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి చేసిన ఆందోళన విషయంలో కూడా అహ్మద్ ఖాన్ ఎస్వీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. ఆయన వైసీపీలో వెనుకబడ్డారని, దాన్ని నిలబెట్టుకోడానికి నానా తంటాలు పడుతున్నాడని అహ్మద్ ఖాన్‌ అన్నట్లుగా చెబుతున్నారు.

Also Read: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు ఖరారు

కర్నూలులో వైసీపీ చేపట్టిన ఆందోళనలో జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి మాత్రమే హైలైట్ అయ్యారంటూ ఐటీడీపీ ప్రతినిధితో ఫోన్ కన్వర్జేషన్‌లో మాట్లాడారు వైసీపీ నగర అధ్యక్షుడు అహ్మద్ ఖాన్. ఎస్వీ మోహన్ రెడ్డి వన్ మ్యాన్ షో చేస్తున్నారంటూ సొంత పార్టీ నేతపై నెగెటివ్‌ కామెంట్స్‌ చేశారాయన. సరిగ్గా ఈ పాయింట్స్‌నే తమకు అనుకూలంగా మల్చుకునేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. వైసీపీలో అంతర్గత విభేదాలు గట్టిగా ఉన్నాయని ప్రొజెక్ట్ చేస్తూ..ఆడియో రికార్డ్‌ను పోస్ట్‌ చేసింది టీడీపీ సోషల్‌ మీడియా టీమ్. ఇదే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో మంటలు పుట్టిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా కర్నూల్‌ నగర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలతో క్యాడర్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. అటు ఎస్వీకి చెందిన సోషల్‌ మీడియా టీమ్‌ కూడా అహ్మద్‌ అలీఖాన్ పేరు ప్రస్తావించకుండా కొన్ని పోస్ట్‌లు పెట్టడం కలకలం రేపుతోంది. మరికొందరు సోషల్ మీడియాలోనే అహ్మద్ అలీఖాన్‌ను నిలదీస్తున్నారు.

కర్నూలు వైసీపీలో ముగ్గురు కీలక నేతలు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్, నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ మూడు గ్రూప్‌లు విడిపోయి యాక్టివిటీ నడిపిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా పోరు మాత్రం ఆగడం లేదు. అది చాలదన్నట్లుగా అహ్మద్ ఖాన్ వాయిస్ రేజ్ చేయడంతో పాటు ఆయన ఆడియో కాల్ టీడీపీ సోషల్ మీడియా టీమ్‌కు చిక్కడం మరింత చర్చనీయాంశంగా మారింది. రాయలసీమకు ముఖద్వారంగా ఉన్నా కర్నూలు వైసీపీలో నడుస్తున్న అంతర్గత పోరుపై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి మరి.