Droupadi Murmu: విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి.. ఆలయ అధికారుల ఘన స్వాగతం
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని అత్యంత భక్తిప్రపత్తులతో దర్శించుకున్నారు.
President droupadi murmu visits vijayawada kanaka durga temple indrakeeladri
Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని అత్యంత భక్తిప్రపత్తులతో దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి(Droupadi Murmu) ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేశ్ పాశ్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకున్న రాష్ట్రపతికి ఇంద్రకీలాద్రి వద్ద హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, దేవస్థానం ఛైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయాల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం లభించింది.
అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం తో పాటు శేషవస్త్రం, అమ్మవారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలు మరియు జ్ఞానపీఠ చిత్రపటాన్ని బహుకరించారు. ఆలయ దర్శన సమయంలో క్యూలైన్లలో వేచి ఉన్న సాధారణ భక్తులకు అభివాదం చేస్తూ ద్రౌపదీ ముర్ము ముందుకు సాగడం అందరినీ ఆకట్టుకుంది.
