AP SIPB Meeting: ఏపీ యువతకు గుడ్ న్యూస్.. రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు, 21 వేల ఉద్యోగాలు.. ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (AP SIPB Meeting) సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తును మార్చేసే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
sipb green signal for 2 lakh crore new projects in AP.
- రూ. 2.08 లక్షల కోట్ల పెట్టుబడులు.
- ఏపీలో 21 వేల ఉద్యోగాలు.
- 175 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు.
AP SIPB Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తును మార్చేసే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,08,406 కోట్ల భారీ పెట్టుబడులతో కూడిన వివిధ పరిశ్రమల ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఈ భారీ ప్రాజెక్టుల రాకతో రాష్ట్రంలోని యువతకు ఏకంగా 21,627 కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాలు:
పరిశ్రమల స్థాపనతో పాటు గ్రామీణ ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని అధికారులకు సీఎం (AP SIPB Meeting)స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వచ్చే డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలను నేరుగా అందిస్తామని ఆయన ప్రకటించారు. అలాగే, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు వీలుగా రాబోయే సెప్టెంబరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 175 ఎంఎస్ఎంఈ పార్కులను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు.
భవిష్యత్తు సాంకేతిక రంగాలపై దృష్టి:
రాష్ట్రంలో రాబోతున్న డిఫెన్స్ ప్రాజెక్టులు దేశానికే గర్వకారణంగా నిలుస్తాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో గ్రీన్ అమ్మోనియా, లిథియం ఐయాన్ బ్యాటరీ తయారీ, రోబోటిక్స్ వంటి భవిష్యత్తు సాంకేతిక రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాలు, పారదర్శక నిర్ణయాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రధాన పెట్టుబడుల కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం తేల్చిచెప్పారు.
