2 రోజులకోసారి మటన్ కీమా.. 20రకాల డ్రై ఫ్రూట్స్ : పందెంకోళ్ల ఫుడ్ మెనూ

పందెం కోళ్ల పెంపకం అంత ఆషామాషీ యవ్వారం కాదు. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా మూడు నెలల పాటు కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటారు. చిన్నపాటి

  • Publish Date - January 13, 2020 / 04:10 PM IST

పందెం కోళ్ల పెంపకం అంత ఆషామాషీ యవ్వారం కాదు. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా మూడు నెలల పాటు కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటారు. చిన్నపాటి

పందెం కోళ్ల పెంపకం అంత ఆషామాషీ యవ్వారం కాదు. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా మూడు నెలల పాటు కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటారు. చిన్నపాటి వ్యాయామశాలను ఏర్పాటు చేసి కసరత్తులు చేయిస్తారు. ఫుడ్‌ మెనూ విషయంలో రాజీపడకుండా బలమైన ఆహారాన్ని అందిస్తారు. ఒంట్లో కొవ్వును కరిగించి.. బరిలో తొడ గొట్టేలా కోళ్లను తీర్చిదిద్దుతారు. ఈసారి బరులు మినీ స్టేడియాలను తలపిస్తుంటే.. బెట్టింగ్‌ రేంజ్‌ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు కోర్టు ఆంక్షలు, ఖాకీల హెచ్చరికలు.. నిర్వాహుకుల్ని కంగారుపెడుతున్నాయి. 

పందెం కోళ్ళు పెంచడం సాధారణమైన విషయం కాదు. పిల్ల స్టేజి నుంచి పెద్దదై బరిలోకి దిగేదాకా అహరహం శ్రమిస్తారు నిర్వాహకులు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా కోళ్లను కన్నపిల్లల్లా చూసుకుంటారు. కట్‌ అవుట్‌ తోనే ప్రత్యర్థి ఖంగుతినేలా తీర్చిదిద్దుతారు. ఉదయాన్నే స్విమ్మింగ్ చేయిస్తారు. రన్నింగ్‌, ఈత వల్ల కాళ్లు బలిష్టంగా తయారు కావడమే కాకుండా.. పైకి, పక్కకు ఈజీగా ఎగురగలవు. ఎదుటి కోళ్లు దాడి చేస్తే క్షణాల వ్యవధిలో తప్పించుకుని తిరిగి ఎటాక్‌ చేసేలా గట్టి శిక్షణ ఇస్తారు.

పందెం కోడికి ఫుడ్ మెనూ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవరు. రోజూ ధాన్యం, చోళ్లు, గంటెలు, కోడి గుడ్డుతో పాటు రెండు రోజులకోసారి మటన్‌ ఖీమా పెడతారు. అలాగే బాదం, పిస్తా, అంజీర్ లాంటి దాదాపు 20రకాల డ్రై ఫ్రూట్స్ పెడతారు. ఇవి కాకుండా ఇంకా చాలా ఆహారం వీటికి అందిస్తారు. కానీ బయటకు చెప్పరు. ఎందుకంటే.. గెలుపు మంత్రం వెనుక ఉన్న రహస్యం తెలిసిపోతుందని. వీటి ఖరీదు 10 వేల నుంచి లక్ష రూపాయల దాకా ఉంటుంది. కానీ కోళ్లపై బెట్టింగ్‌ మాత్రం 15 నుంచి 20 లక్షల రూపాయల దాకా వేస్తారు.

డెయిలీ ఎక్సర్‌ సైజులు.. బలమైన ఆహారం అందిస్తారు. అదే సమయంలో ఒంట్లో ఎక్కడా కొవ్వు దరిచేరకుండా జాగ్రత్త పడతారు. ఒకవేళ కొవ్వు ఉంటే ఫైటింగ్‌లో కోడి అలిసిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎంత తిండి పెడితే అంత వ్యాయామం చేయిస్తారు. ఒక బాడీ బిల్డర్‌ కాంపిటీషన్‌కి ఎలా సన్నద్దం అవుతాడో… ఇంచుమించు అదే రకమైన ట్రైనింగ్‌ కోళ్లకు ఇస్తారు. చెస్ట్‌ పెరగడానికి బార్‌ డిప్స్‌.. కాళ్లు బలిష్టంగా ఉండాలంటే సిటప్స్‌, రన్నింగ్‌.. మెడ బలిష్టానికి నెక్‌ రాడ్‌ రొటేషన్‌.. భుజాల్లో బలం పెరగడానికి షోల్డర్‌ వర్కవుట్ చేస్తారు. వేర్వేరు ఎక్సర్‌ సైజులతో పందెం కోడిని ఓ బాడీ బిల్డర్‌గా తీర్చిదిద్దుతారు.

తూర్పుగోదావరి జిల్లాలో పందెం కోళ్ళ పెంపకం ఓ కుటీర పరిశ్రమలా మారింది. వ్యవసాయ క్షేత్రాలు, తోటలు, కల్లాలు, మకాంలతో పాటు ఇళ్ళలో కూడా పందెం కోళ్ళను పెంచుతారు. అలాగని అన్ని కోళ్లను ఓకే చోట పెంచరు.. కొన్నింటిని రహస్య ప్రాంతాల్లో పెంచుతారు. ఒకవేళ పోలీసులు దాడులు చేసినా పట్టుబడకుండా. కొందరైతే ఏకంగా తాము ఉండే ఇళ్లలోనే సొంత కుటుంబసభ్యుడిలా పెంచుకుంటారు.

సంప్రదాయం పేరుతో తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఏటా కోడి పందాలు జరుగుతూనే ఉన్నాయి. కోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ బరులకు గిరి గీస్తున్నారు. ఈసారి పందాల బరులు మినీ స్టేడియాన్ని తలపిస్తు ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఏర్పాట్లే ఇంత గ్రాండ్‌గా ఉంటే.. బెట్టింగ్‌లు ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇంత చేసినా పందాలపై మీమాంస మాత్రం పోవడం లేదు. సాఫీగా సాగుతాయా.. ఖాకీలు ఆటంకం కలిగిస్తారా అన్న టెన్షన్‌ మాత్రం నిర్వాహకులను కలవరపెడుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సంక్రాంతి కావడంతో స్థానిక నాయకులు కోడి పందాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పందాల నిర్వహణకు అనధికార అనుమతుల కోసం ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తరాలుగా వస్తున్న సంప్రదాయ క్రీడను కొనసాగించాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారు. బరుల వైపు ఖాకీలు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సీన్‌ చూస్తుంటే.. గతేడాది కంటే మరింత రంజుగా, రసవత్తరంగా పందాలు జరగడం ఖాయంగా కనిపిస్తుంది.

Also Read : సమరానికి సై : ఈసారి సంక్రాంతి విన్నర్ ఏ ”జాతి కోడి”

ట్రెండింగ్ వార్తలు