Vizag New Airport : విశాఖ నుంచి ప్రయాణిస్తున్నారా? జూలై 8 తర్వాత ఇదే కొత్త ఎయిర్పోర్ట్.. మీ టికెట్ వివరాలు చెక్ చేసుకోండి!
Vizag New Airport : వైజాబ్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లేవారికి జూలై 8 నుంచి కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి. పాత ఎయిర్ పోర్టు నుంచి కాకుండా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా విమానాలు నడవనున్నాయి. పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Vizag New Airport
Vizag New Airport : విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి వెళ్లే విమాన ప్రయాణికులకు కీలక అప్ డేట్.. జూలై 8 నుంచి విశాఖలోని విమాన సర్వీసుల్లో భారీ మార్పు జరగనుంది.
ప్రస్తుతం విశాఖ నేవీ బేస్‌లోని పాత ఎయిర్‌పోర్టు నుంచి నడిచే పౌర విమాన సర్వీసులు ఇకపై భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మారనున్నాయి. దాంతో విమాన ప్రయాణికులు తమ టికెట్ వివరాలు, బయలుదేరే ఎయిర్ పోర్టు, ప్రయాణ సమయాన్ని ముందుగానే చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది..
దేశీయ విమాన సర్వీసులను అందించే ఎయిర్‌లైన్స్ ఇండిగో, ఎయిరిండియా సంస్థలు జూలై 8 నుంచి భోగాపురం మీదుగా కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. అయితే, అంతర్జాతీయ సర్వీసులను అందించే స్కూట్ ఎయిర్ లైన్స్ మాత్రం జూలై 25 నుంచి కొత్త ఎయిర్ పోర్టు నుంచి సేవలను అందించనుంది. అంతర్జాతీయ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మార్పును దశలవారీగా అమలు చేయనున్నాయి.
ముందుగా విమాన టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ PNR స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఎయిర్ పోర్టులో బయల్దేరే విమాన వివరాల్లో ఏమైనా మార్పులు జరిగాయా లేదా తెలుసుకోవాలి. మీకు ఏమైనా ఎయిర్‌లైన్ నుంచి ఈమెయిల్స్ లేదా మెసేజ్ లు వస్తే చెక్ చేసుకోండి.
కొత్త భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు విశాఖ సిటీకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముఖ్యంగా ఎంవీపీ కాలనీ, గాజువాక, కూర్మన్నపాలెం వంటి ప్రాంతాల మీదుగా వెళ్లే ప్రయాణికులు అదనంగా కనీసం 45 నిమిషాల ప్రయాణ సమయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హైవేపై ట్రాఫిక్ పరిస్థితులను బట్టి విమానం బయలుదేరే సమయానికి ముందుగానే ఇంటి నుంచి బయలుదేరాల్సి ఉంటుంది.
ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ స్పెషల్ షటిల్ బస్సులను కూడా నడుపనుంది. ప్రతి అరగంటకు ఒక బస్సు రానుంది. అయితే క్యాబ్‌ల్లో వెళ్లేవారు టోల్ ఛార్జీలు, ప్రయాణ ఖర్చులను ముందుగానే అంచనా వేసుకుంటే బెటర్.
కొత్త ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో ప్రయాణికుల రద్దీ తగ్గేందుకు వెబ్ చెక్-ఇన్ పూర్తి చేయడం బెటర్. ఎక్కువ లగేజీతో వెళ్లేవారు చెక్-ఇన్ కౌంటర్ల వద్ద టైమ్ పట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవడం ఉత్తమం.
ఇండిగో, ఎయిరిండియా : జూలై 8 నుంచి భోగాపురం నుంచి దేశీయ విమాన సర్వీసులు
స్కాట్ ఎయిర్ లైన్స్ : జూలై 25 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు
పాత విశాఖ ఎయిర్ పోర్టు : జూలై 8 నుంచి పౌర విమానాల రాకపోకలు నిలిపివేత
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్రకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ప్రధానంగా పర్యాటకంతో పాటు కార్గో రవాణా, పారిశ్రామిక పెట్టుబడులకు ప్రయోజనకరంగా మారుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. కొత్త టెక్ కారిడార్, పారిశ్రామిక అభివృద్ధి కారణంగా రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మీరు ఇప్పటికే విమాన టికెట్లను బుకింగ్ చేసుకుని ఉంటే ఓసారి మీ ఫ్లయిట్ టికెట్ వివరాలతో పాటు ఈమెయిల్స్, పీఎన్ఆర్ స్టేటస్‌ను కూడా చెక్ చేసుకోండి. అలాగే కొత్త ఎయిర్ పోర్టు చేరుకునే మార్గం, పార్కింగ్, రవాణా ఏర్పాట్లను ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్..
