TTD Board: శ్రీవారి భక్తులకు బీమా.. దేశంలోనే తొలిసారిగా.. టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తులు, టీటీడీ(TTD Board) ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాలక మండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.
TTD Board announces free LIC insurance for devotees.
- తిరుమల భక్తులకు ఉచిత ఇన్సూరెన్స్
- ఉద్యోగుల బీమా పది లక్షలు
- లడ్డూలకు నాలుగువందల మంది సిబ్బంది
TTD Board: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తులు, టీటీడీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాలక మండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి ఈ వివరాలను వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఎల్ఐసీ ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, సెప్టెంబర్ 15న సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.
భక్తులకు ఉచిత ఇన్సూరెన్స్.. ఉద్యోగుల బీమా రూ.10 లక్షలకు పెంపు:
తిరుమల (TTD Board)కొండపై సహజ మరణం పొందే భక్తులకు రూ.2 లక్షల బీమా వర్తించేలా ఎల్ఐసీకి రూ.2.12 కోట్లు చెల్లించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణించిన టీటీడీ ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచారు. సిపిఎస్, ఎన్పిఎస్ పెన్షనర్లు వారి కుటుంబాలకు ఇహెచ్ఎఫ్ (EHF) సౌకర్యం కల్పిస్తూ యాజమాన్య వాటా కింద రూ.2 కోట్లు కేటాయించగా, 48 మంది ఉద్యోగుల వేతనాల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
లడ్డూల తయారీకి 400 మంది కొత్త సిబ్బంది.. ఆలయాల్లో బంగారు తాపడం:
శ్రీవారి పోటులో ప్రసాదం లడ్డూల తయారీని వేగవంతం చేసేందుకు అదనంగా 400 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపనున్నారు. దీంతో పాటు నారాయణవనం శ్రీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం పనులకు ఆమోదం తెలిపారు. చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠం బంగారు తాపడం కోసం రూ.17.05 కోట్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
