Garuda Map App: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ‘గరుడ మ్యాప్’ యాప్.. ఇక ఎక్కడికైనా ఈజీగా వెళ్లొచ్చు!
తిరుమల శ్రీవారి భక్తుల కోసం 'గరుడ మ్యాప్(Garuda Map App) యాప్'ను అందుబాటులోకి తీసుకురానున్న టీటీడీ.
TTD launching 'Garuda app' for Tirumala devotees.
Garuda Map App: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఎవరి సహాయం తీసుకోకుండానే భక్తులు తాము చేరుకోవాల్సిన ప్రాంతాలకు సులువుగా చేరుకునేలా ‘గరుడ మ్యాప్(Garuda Map App)’ అనే సరికొత్త యాప్‌ను సిద్ధం చేసింది. ఐఓఎస్ (iOS), ఆండ్రాయిడ్ (Android) వినియోగదారులకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దిన ఈ యాప్ మరో రెండు రోజుల్లో భక్తులకు అందుబాటులోకి రానుంది. తిరుమలలోని ప్రధాన సేవా కేంద్రాలు, క్యూ కాంప్లెక్స్‌లు, వసతి గృహాల సమాచారంతో పాటు ప్రయాణ మార్గాలను కూడా ఈ యాప్ స్పష్టంగా చూపిస్తుంది.
వాయిస్ కమాండ్‌తో దారులు ఖరారు.. డిజిటల్ దిశగా టీటీడీ విప్లవాత్మక అడుగు:
ఈ యాప్ ద్వారా భక్తులు ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా కేవలం ఆ పేరును టైప్ చేయడం లేదా వాయిస్ కమాండ్ ద్వారా చెప్పడం మాత్రమే సరిపోతుంది. ఉదాహరణకు తలనీలాలు సమర్పించేందుకు కళ్యాణకట్టకు వెళ్లాలనుకుంటే, యాప్‌లో నమోదు చేయగానే తిరుమలలోని అన్ని కళ్యాణకట్టల వివరాలతో పాటు అక్కడికి చేరుకునేందుకు సులువైన దారులు స్క్రీన్‌పై డిస్ప్లే అవుతాయి. కళ్యాణకట్టలతో పాటు శ్రీవారి దర్శనం ఎంట్రన్స్, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, గెస్ట్ హౌస్‌లు, అన్నప్రసాదం ఫుడ్ కౌంటర్లు తదితర వివరాలను కూడా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ సాంకేతికత ద్వారా తిరుమల భక్తులకు దిశా నిర్దేశం చేయడం ఎంతో తేలిక కానుంది.
