YS Jagan: చంద్రబాబు పెద్ద ‘రిగ్గింగ్ మాస్టర్’.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్.. ఏపీలో వేడెక్కిన రాజకీయం!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీఎం చంద్రబాబుపై ‘రిగ్గింగ్ మాస్టర్’ హ్యాష్‌ట్యాగ్‌తో సంచలన ట్వీట్ చేశాడు వైఎస్ జగన్(YS Jagan).
Ys jagan targets chandrababu naidu with rigging master hashtag on x
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా ‘రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన చేసిన సంచలన పోస్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రజాస్వామ్యంపై నీతులు వద్దంటూ సెటైర్లు.. గొర్రెతోలు కప్పుకున్న తోడేలంటూ ఘాటు వ్యాఖ్యలు:
గొర్రెతోలు కప్పుకున్న తోడేలుకు, చంద్రబాబుకు ఎలాంటి తేడా లేదని వైఎస్ జగన్ తన ట్వీట్లో తీవ్రంగా ధ్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించిన ఒక ‘రిగ్గింగ్ మాస్టర్’ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లించడం చూసి ప్రజలంతా నివ్వెరపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ పరోక్షంగా ఆరోపణలు గుప్పిస్తూ, తన పోస్ట్ చివర్లో ‘హే రామ్.. సేవ్ ఆంధ్రా’ అంటూ వ్యాఖ్యానించడం విశేషం.
వేడెక్కిన ఏపీ రాజకీయం.. కూటమి నేతల కౌంటర్ అటాక్‌పై పెరుగుతున్న ఆసక్తి:
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఇప్పటికే పరస్పర ఆరోపణలు శృతిమించగా, జగన్ చేసిన ఈ ట్వీట్ వివాదానికి మరింత నెయ్యి పోసినట్లయింది. ప్రతిపక్ష నేత చేసిన ఈ ఘాటైన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీతో పాటు అధికార కూటమి నాయకులు ఏ విధంగా తిప్పికొడతారు, ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
