గత ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో ఆత్మవిశ్వాసంతో పాటు జోష్ పెరిగితే.. టీడీపీలో మాత్రం ఆందోళన ఎక్కువైంది. ఇప్పుడిప్పుడే కోలుకొని మళ్లీ పుంజుకొనేందుకు చేస్తోన్న ప్రయత్నాలను వైసీపీ దెబ్బతీస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకున్న నేతలు.. తెలుగుదేశం పార్టీని వీడిపోతున్నారు. అలా వలస పోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చేరికలను ప్రోత్సహిస్తూ వైసీపీ గేట్లు తెరిచేయడంతో వివిధ పార్టీ నుంచి వలస వెళ్లిపోతున్నారు.
టీడీపీ నుంచి ఎక్కువ మంది వైసీపీలో చేరిపోతున్నారు. ఇది టీడీపీకి ఇబ్బందికరంగా మారిందని జనాలు అంటున్నారు. తొమ్మిది నెలలుగా వలసలను ప్రోత్సహించేందుకు సిద్ధపడని పార్టీ అధినేత జగన్.. ఇప్పుడు స్థానిక సమరానికి ముందు మాత్రం పార్టీ డోర్లు బార్లా తెరిచారు. దీంతో టీడీపీలో సీనియర్లు, మంత్రులుగా పని చేసిన వారు, ప్రస్తుతం ఎమెల్సీలుగా ఉన్నవారు సైతం వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. ఈ వలసలు రెండు పార్టీల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. సీనియర్లు పార్టీ వీడుతుండడంతో టీడీపీ బలహీనపడుతోంది.
See Also | నామినేషన్ల చివరి రోజు రచ్చ చేసిన వైసీపీ.. ప్రజాస్వామ్యం లేదంటున్న టీడీపీ
మరోపక్క, వైసీపీలోకి చేరుతోన్న సీనియర్ల సంఖ్య పెరుగుతుండడంతో అక్కడ ఆధిపత్య పోరుకు అవకాశం ఇస్తోందని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే ఈ చేరికల ప్రోత్సాహం వెనుక అసలు కారణమని చెబుతున్నారు. గంపగుత్తగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో వైసీపీ ఉంది. టీడీపీని కనుమరుగు చేయాలన్నదే ఆ పార్టీ ఉద్దేశం. ఎవరైనా పార్టీలోకి రావొచ్చంటూ, ముఖ్యంగా టీడీపీ నాయకులకు ఆహ్వానం అంటూ డోర్లు ఓపెన్ చేసేశారు.
పెద్ద సంఖ్యలో టీడీపీ నుంచి వైసీపీలోకి నాయకులు వస్తున్నారట. ఈ పరిణామంతో వైసీపీలో ఇప్పటికే నాయకులుగా ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందనే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారట. జిల్లా, మండల పరిషత్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల ప్రకటన రాగానే పార్టీలోకి చేరికలు మొదలు పెట్టేశారు.
See Also | టీడీపీకి వరుస షాకులు : రాజీనామా బాటలో ఎమ్మెల్సీ శమంతకమణి, యామినీబాల
వైసీపీ ఎమ్మెల్యేలున్న ప్రాంతాల నుంచి కూడా వలసలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో హోరాహోరీగా తలపడిన వారిని ఇప్పుడు పార్టీలోకి చేర్చుకోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైందంట. ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్న తాము ఇప్పుడు ఎలా కలిసి పని చేయాలన్న ఆలోచనలో ఎమ్మెల్యేలు పడ్డారని అంటున్నారు. ఉప్పునిప్పుగా ఉన్న తాము ఒక్కసారిగా కలిసి పనిచేయాలంటే కష్టమేనని చెబుతున్నారు.
వారి రాకతో తమకు ఏమైనా ముప్పు ఉంటుందేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. దీంతో ఈ చేరికలు పార్టీని ముంచేసేలా ఉన్నాయని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యనిస్తున్నారు. ఇప్పటికే టీడీపీలో బలమైన నేతలుగా ఉన్నఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, కదిరి బాబూరావు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్తో పాటు పలువురు టీడీపీ సీనియర్లు వైసీపీలో చేరిపోయారు. ఘనమైన మెజార్టీ సాధించిన అధికార వైసీపీ విపక్ష నేతలను పార్టీలో చేర్చుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు.
గ్రామీణ స్థాయిలో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకున్నా మున్సిపాలిటీల్లో మాత్రం అంత ప్రభావం లేదన్నది గత ఎన్నికల్లో తేలిపోయింది. పైగా మెజార్టీ మున్సిపాలిటీల్లో టీడీపీకి ఓట్ల శాతం ఎక్కువగా ఉంది. అందుకే ప్రస్తుతం చేరికలను వైసీపీ ప్రోత్సహిస్తోందని చెబుతున్నారు.
Also Read | అమెరికాకు 5లక్షల కరోనా కిట్లను విరాళంగా ఇచ్చిన Alibaba