Amazon Layoffs : అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ఈసారి 1000 మంది ఔట్.. ఇండియాలో కూడా..!
Amazon Layoffs : గత ఏడాదిలో కంపెనీ 30వేల ఉద్యోగులను తొలగించింది. కరోనా మహమ్మారి సమయంలో కంపెనీ అవసరానికి మించి ఉద్యోగులను నియమించుకున్న కారణంగానే ఈ ఉద్యోగ కోతలు చేపట్టినట్టు జెఫ్ బెజోస్ తెలిపారు.
Amazon Layoffs
- 2025లో ఏకంగా 30వేల ఉద్యోగుల తొలగింపు
- వైట్-కాలర్ ఉద్యోగుల సంఖ్య 1,000 కన్నా తక్కువ
- అమెరికా, భారత్, యూకేలకు చెందిన ఉద్యోగులు
Amazon Layoffs : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో విడత ఉద్యోగ కోతలను ప్రకటించింది. రాయిటర్స్ ప్రకారం.. ఈ-కామర్స్ వెబ్సైట్ మానిటరింగ్ ‘స్టోర్స్’ యూనిట్లో ప్రధానంగా కొన్ని ఉద్యోగాలను తొలగించినట్లు ఆ సంస్థ ధృవీకరించింది. అంతర్గత స్లాక్ ఛానెళ్ల ప్రకారం.. ఈ తొలగింపులు ‘స్టోర్స్’లోని కస్టమర్ సర్వీస్, సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్‌తో సహా పలు విభాగాలపై ప్రభావం చూపాయి.
కంపెనీలో ఖర్చులు తగ్గింపు, భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగానే ఈ లేఆఫ్‌లు కొనసాగుతున్నాయని అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఉద్యోగ కోతల వల్ల అమెజాన్‌లోని ఇతర యూనిట్ల ఉద్యోగులు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో అమెరికా, భారత్, యూకేలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. రాయిటర్స్ ప్రకారం.. ఈసారి అమెజాన్ తొలగించిన వైట్-కాలర్ ఉద్యోగుల సంఖ్య 1,000 కన్నా తక్కువే..
గత ఏడాదిలో 30వేల ఉద్యోగాల కోత :
ప్రస్తుతం అమెజాన్ క్రమంగా ఉద్యోగాలను తగ్గిస్తోంది. గత ఏడాదిలో ఈ సంస్థ 30వేల ఉద్యోగాలను తొలగిస్తూ భారీ ఎత్తున ఉద్యోగ కోతలను చేపట్టింది. ఈ ప్రక్రియ ఈ ఏడాది జనవరి వరకు కొనసాగింది.
మరోవైపు.. కరోనా మహమ్మారి సమయంలో అవసరానికి మించి ఎక్కువ మందిని నియమించుకున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెజోస్ బుధవారం ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహమ్మారి సమయంలో కంపెనీ అవసరానికి మించి ఉద్యోగులను నియమించుకోవడం వల్ల ఉద్యోగ కోతలు కొనసాగించాల్సి వచ్చిందని అన్నారు.
