Instagram AI Image : ఇన్‌స్టాలో AI ఫీచర్‌పై దుమారం.. యూజర్ల దెబ్బకు మెటా సైలెంట్‌గా ఎత్తేసింది.. అసలేం జరిగిందంటే?
Instagram AI Image Feature : ఇన్స్టాగ్రామ్ యూజర్లకు కొత్త క్రియేటివిటీ టూల్ అందించాలనే లక్ష్యంతో కంపెనీ ఈ ఫీచర్‌ను ప్రారంభించినట్లు మెటా అధికారిక బ్లాగ్‌లో తెలిపింది.
Instagram AI Image Feature
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ ఇమేజ్ ఫీచర్ రచ్చ
- యూజర్ల ప్రైవసీకి ముప్పు ఉందంటూ విమర్శలు
- తీవ్ర వ్యతిరేకిత కారణంగా ఏఐ ఫీచర్ తొలగించిన మెటా
Instagram AI Image Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ ఇమేజ్ వివాదాస్పదమైంది. మెటా ప్రవేశపెట్టిన ఈ కొత్త ‘మ్యూజ్ ఇమేజ్’ అనే ఏఐ ఫీచర్ కారణంగా యూజర్ల ప్రైవసీకి ముప్పు ఉందనే ఆందోళనలను రేకిత్తించింది. ఈ టూల్ ద్వారా యూజర్ల ఫోటోలను ఏఐ ఆధారంగా ఎడిట్ చేయొచ్చు.
అలాగే కొత్త ఫొటోలను జనరేట్ చేయొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మార్చడం వంటి అన్ని పనులు చేయొచ్చు. అయితే, ఈ ఏఐ టూల్‌తో ప్రైవసీ (Instagram AI Image Feature) ముప్పు ఉందంటూ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. వ్యతిరేకత నేపథ్యంలో మెటా ఈ ఏఐ ఫీచర్‌ను సైలెంటుగా తొలగించింది.
మెటా అధికారిక సమాచారం ప్రకారం.. :
వినియోగదారులకు మరింత క్రియేటివిటీ ఎక్స్ పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ టూల్‌ను తీసుకొచ్చింది. అయితే, పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటుంది.
ఈ ఫీచర్ డిసేబుల్ చేయాలంటే యూజర్లే ప్రత్యేకంగా సెట్టింగ్స్ మార్చాల్సి రావడం వివాదానికి కారణమైంది. తమ అనుమతి లేకుండా ఫొటోలను ఏఐ కోసం వాడే అవకాశం ఉందనే భయంతో అనేక మంది యూజర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్రం సీరియస్.. మెటాను వివరణ అడిగే ఛాన్స్ :
ఈ వివాదాస్పద అంశాన్ని భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా తీసుకుంది. ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు వస్తే మాత్రం భారత చట్టాల ప్రకారం లోతుగా విచారణ చేపడతామని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తెలిపింది. డీప్‌ఫేక్‌లు, అనధికారిక ఏఐ ఫొటోలపై కఠిన వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం అవసరమైతే మెటాను కూడా వివరణ కోరే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏఐ ఇమేజ్ ఫీచర్‌పై వ్యతిరేకత వచ్చింది. అమెరికా నటుల సంఘం (SAG-AFTRA), ప్రముఖ టాలెంట్ ఏజెన్సీ సీఏఏతో పాటు పలు ప్రైవసీ సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండా వారి ఫేస్, పేరు, వాయిస్ లేదా ఫొటోలను ఏఐ మోడళ్లలో వాడరాదని హెచ్చరించాయి.
ఈ వివాదం తర్వాత భవిష్యత్తులో ఏఐ ఫీచర్ల అభివృద్ధిలో కూడా యూజర్ల ప్రైవసీ, అనుమతికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని మెటా స్పష్టం చేసింది. టెక్నికల్ ఫీచర్లతో పాటు యూజర్ల విశ్వాసాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని అభిప్రాయపడింది.
