RBI Repo Rate: హోమ్ లోన్, ఆటో లోన్ ఉన్నవారికి భారీ షాక్.. మళ్ళీ వడ్డీ రేట్స్ పెంచిన ఆర్బీఐ.. ఎంత పెరిగాయో తెలుసా?
రుణాలపై వసూలు చేసే రెపో రేటును(RBI Repo Rate) 25 బేసిస్ పాయింట్లు 0.25 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.
Rbi monetary policy repo rate hike by 25 bps home car loans to get costlier
RBI Repo Rate: దేశంలో సగటు మధ్యతరగతి ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఊహించని షాకిచ్చింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ.. కీలక వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆర్బీఐ బ్యాంక్‌లకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచడంతో కొత్త రేటు 5.50 శాతానికి చేరింది. ఫిబ్రవరి 2023 తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్ల(RBI Repo Rate)ను మళ్లీ పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ద మేఘాలు, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల వల్ల దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి పెరిగే ప్రమాదం ఉందన్న ముందస్తు అంచనాలతోనే ఆర్బీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఈఎంఐల భారం ఖాయం.. క్రమంగా తగ్గి.. మళ్లీ పెరుగుతున్న వడ్డీ రేట్ల గ్రాఫ్:
ఆర్బీఐ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో రెపో రేటుతో ముడిపడి ఉన్న గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు బాగా ప్రియం కానున్నాయి. ఫలితంగా సామాన్యులపై నెలవారీ ఈఎంఐల భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది. గత ఏడాది కాలంగా ఆర్బీఐ క్రమంగా 1.25 శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించి, ఆ తర్వాత వరుసగా నాలుగు సమీక్షల్లో రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చింది. అయితే, తాజా పెంపుతో మళ్లీ వడ్డీ భారం మొదలవుతుండటంతో మధ్యతరగతి వర్గాలు, రుణగ్రహీతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
